
పూటకో మాట.. రోజుకో నిబంధన
● గందరగోళంగా పాఠశాలలపునర్‌వ్యవస్థీకరణ ● యూటీఎఫ్ ధ్వజం
అనకాపల్లి: పాఠశాలల పునర్‌వ్యవస్థీకరణలో లోపాలను సవరించాలని, పూటకోక మాట.. రోజుకో నిబంధనలతో విద్యావ్యవస్థను గందరగోళంలోకి నెట్టడం జరుగుతుందని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొందవి చిన్నబ్బాయ్ అన్నారు. జీవీఎంసీ విలీన గ్రామమైన డీఈవో కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విద్య వ్యవస్థను గందరగోళంలోకి నెట్టేస్తూ టీచర్ల బదిలీలు, పదోన్నతులను ప్రశ్నార్థకం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పాఠశాలల పునర్‌వ్యవస్థీకరణలో గత ప్రభుత్వం ఆరు రకాల పాఠశాలలుగా విభజిస్తే, ప్రస్తుత ప్రభుత్వం వాటిని తొమ్మిది రకాల పాఠశాలలుగా విభజించి ప్రజలను గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టిందన్నారు. రాష్ట్ర ఉన్నతాధికారులు జీవో నంబర్ 117 ను రద్దు చేస్తామని ఏడాదిపాటు చెబుతున్నప్పటికీ, ఇప్పటికీ రద్దు చేయలేదన్నారు, ఆ జీవోలో ఉన్న ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని కొనసాగించడం తగదన్నారు. హై స్కూళ్లలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:40 గా ఉండాలన్నారు. ప్రాథమిక పాఠశాలలో 1:20 గా ఉండాలని, యూపీ పాఠశాలలను ఎత్తి వేయడం వల్ల పల్లె విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. 40 మంది విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలను మోడల్ ప్రైమరీ పాఠశాలలుగా మార్చాలని పేర్కొన్నారు. రేషనలైజేషన్‌కు ఏప్రిల్ 23 నాటి విద్యార్థుల రోల్‌ను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. బదిలీలు, పదోన్నతులకు స్థిరమైన మార్గదర్శకాలు జారీ చేయాలన్నారు. సమస్యల సాధన కోసం ఈనెల 15న రాష్ట్ర స్థాయి ధర్నా విజయవాడలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా యుటీఎఫ్ గౌరవాధ్యక్షుడు బోయిన వెంకటరావు, సహాధ్యక్షుడు రొంగళి అక్కునాయుడు, కోశాధికారి రాజేష్, కార్యదర్శులు సూర్య ప్రకాష్, రాజునాయుడు, రాష్ట్ర కౌన్సిలర్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.