అప్పన్న సేవలోఒడిశా దాసులు | - | Sakshi
Sakshi News home page

అప్పన్న సేవలోఒడిశా దాసులు

May 12 2025 12:51 AM | Updated on May 12 2025 12:51 AM

అప్పన్న సేవలోఒడిశా దాసులు

అప్పన్న సేవలోఒడిశా దాసులు

పది.. ఇరవయ్యేళ్లు కాదు.. ఏకంగా 300 ఏళ్లకు పైనే.. శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి సేవలో

ఓ కుటుంబం తరిస్తోంది. ఏటా మూడు మాసాలు సింహగిరిపైనే ఉంటూ.. స్వామిని పూజిస్తూ, ఆర్జిత సేవలు చేస్తూ.. భక్తులకు ఇతోధికంగా సాయపడుతోంది. వారే ఒడిశాలోని

గంజాం జిల్లా పట్టుపురం గ్రామానికి చెందిన దాసుల కుంటుంబం. ప్రస్తుతం ఆ వంశానికి

చెందిన నాలుగో తరం వారైన లక్ష్మీకాంత్‌నాయక్‌దాస్‌ అప్పన్నస్వామి సేవలో తరించేందుకు

సింహాచలానికి చేరుకున్నారు.

సింహాచలం: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి క్షేత్రంతో ఒడిశా భక్తులకు విడదీయరాని అనుబంధం ఉంది. అందులోనూ గంజాంలోని పట్టుపురం గ్రామానికి చెందిన నాయక్‌దాస్‌ కుటుంబానిది మరీ ప్రత్యేకం. మూడు వందల ఏళ్లకు పైనుంచే ఈ కుటుంబానికి చెందిన ఒకరు స్వామి సేవకు అంకితమవడం ఆనవాయితీ. ఏటా మూడు నెలలు సింహగిరిపై ఉండి స్వామి సేవతోపాటు, తమ వద్దకు వచ్చే భక్తులకు స్వామివారి విశిష్టతను, సింహాచల క్షేత్ర వైభవాన్ని చాటిచెప్తుంటారు.

స్వామి సేవలో నాలుగో తరం

నాలుగో తరానికి చెందిన లక్ష్మీకాంత్‌నాయక్‌దాస్‌ ప్రస్తుతం అప్పన్న సేవలో తరిస్తున్నారు. ఈయన తాతగారి పెదనాన్న ముకుంద నాయక్‌ దాస్‌ నుంచే స్వామికి వీరి కుటుంబం సేవలందించే కార్యక్రమం ప్రారంభమైంది. స్వామిపై ఉన్న ఎనలేని భక్తి కారణంగా అప్పట్లో ఒడిశా నుంచి ముకుంద నాయక్‌దాస్‌ సింహాచలం వచ్చేశారు. సింహగిరిపై ఓ చెట్టు క్రింద తపస్సు చేసుకుంటూ, స్వామి సేవలో తరించేవారు. కొన్నేళ్లకు కంటిచూపు మందగించడంతో తమ్ముడి కొడుకై న రుషికేష్‌నాయక్‌దాస్‌ ఏడేళ్ల వయస్సు నుంచే ఆయన వద్దకు చేరారు. తనకు 9 ఏళ్ల వయసులో పెదనాన్న పరమపదించడంతో ఆ బాధ్యతలను రుషికేష్‌ నాయక్‌దాస్‌ స్వీకరించారు. ఆయన 95 ఏళ్లపాటు స్వామి సేవలో గడిపారు.

ఒడిశా భక్తుల ఆశ్రయం దాస సత్రం

రుషికేష్‌నాయక్‌దాస్‌ 1947లో సింహగిరి క్షేత్రపాలకుడు త్రిపురాంతకస్వామి ఆలయ సమీపంలో కొంత స్థలాన్ని తీసుకుని ఒడిశా నుంచి వచ్చే భక్తుల కోసం ఆశ్రమ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆయన మృతితో ఆయన కొడుకు బుచ్చికిషోర్‌ నాయక్‌దాస్‌ సింహాద్రి అప్పన్న సేవకు అంకితమయ్యారు. ఆ తర్వాత ఆయన తమ్ముడైన వనమాలిక్‌ నాయక్‌దాస్‌ స్వామి సేవను స్వీకరించారు. ఈయన హయాంలోనే రుషికేశ్‌నాయక్‌దాస్‌ శ్రీకారం చుట్టిన ఆశ్రమం దాస సత్రం నిర్మాణం పూర్తయింది. 2006లో వనమాలిక్‌ మృతితో ఆయన కొడుకు ప్రస్తుత దాసుడు లక్ష్మీకాంత్‌నాయక్‌దాస్‌ స్వామి సేవకు అంకితమయ్యారు.

అంతా స్వామి అనుగ్రహం

శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి ఎంతో మహిమాన్వితుడు. నీతి, నియమాలు పాటిస్తూ నిర్మల హృదయంతో ఆరాధిస్తే ఖచ్చితంగా స్వామి అనుగ్రహం లభిస్తుంది. నా తండ్రి పరమపదం వరకు నేను మామూలు వ్యక్తిగానే తిరిగాను. ఆ తర్వాత నాలో భక్తిభావం కలగడం స్వామి కృప. తరతరాల సాంప్రదాయం కొనసాగించే అవకాశం ఆ స్వామి అనుగ్రహంగానే భావిస్తాను. – లక్ష్మీకాంత్‌ నాయక్‌ దాస్‌

3

తరతరాల కుటుంబ సంప్రదాయం... ఒడిశా దాసుల సొంతం

ప్రస్తుతం స్వామి సేవలో 4వ తరానికి చెందిన లక్ష్మీకాంత్‌నాయక్‌దాస్‌

300 ఏళ్లు.. ఐదుగురు దాసులు

ముకుందనాయక్‌ దాస్‌ (ప్రారంభకులు)

రుషికేష్‌నాయక్‌ దాస్‌

(ముకుందనాయక్‌ తమ్ముడి కొడుకు)

బుచ్చికిశోర్‌నాయక్‌ దాస్‌

(రుషికేష్‌నాయక్‌ కొడుకు)

వనమాలిక్‌నాయక్‌ దాస్‌

(బుచ్చికిశోర్‌నాయక్‌ తమ్ముడు)

లక్ష్మీకాంత్‌నాయక్‌ దాస్‌

(వనమాలినాయక్‌ కొడుకు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement