
విద్యుత్‌రంగ ప్రైవేటీకరణను వ్యతిరేకించాలి
అనకాపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈనెల 20న నిర్వహించనున్న సమ్మెకు అన్ని వర్గాల ప్రజల నుంచి పూర్తిస్థాయిలో మద్దతు వస్తోందని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేపాడ సత్యనారాయణ తెలిపారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వాలు కుట్రపన్నుతున్నాయని చెప్పారు. విద్యుత్ రంగ ప్రైవేటీకరణను అందరూ వ్యతిరేకించాలన్నారు. సోలార్ విద్యుత్, విండ్ విద్యుత్, హైదరాబాద్ ప్రాజెక్టులను, స్మార్ట్ మీటర్లను ఇలా అన్నింటినీ అదానీ సంస్థలకు కట్టబెడుతూ ప్రజలపై విపరీతమైన భారాన్ని ప్రభుత్వం మోపుతోందన్నారు. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న కాంటాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయడం లేదని, సమాన పనికి సమాన వేతనం అమలు కావడం లేదని తెలిపారు. సచివాలయ లైన్‌మన్‌లను విద్యుత్‌శాఖలో విలీనం చేసి, వారికి ప్రమోషన్లు కల్పించాలని ఆయన కోరారు. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్స్ భవిష్యత్తులో కార్మిక వర్గానికి తీవ్ర నష్టం కలిగిస్తుందన్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యకతిరేకంగా కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఆర్.కె.వి.ఎస్. కుమార్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శంకరరావు, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ప్రేమ చంద్రశేఖర్, సీఐటీయూ జిల్లా కోశాధికారి వి.వి.శ్రీనివాసరావు, సభ్యులు అవతారం, కేదారేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.