
విద్యుత్ షాక్‌తో 23 గొర్రెలు మృతి
చోడవరం: మండలంలోని గంధవరంలో విద్యుత్ షాక్‌తో 23 గొర్రెలు మృతిచెందాయి. వివరాలిలా ఉన్నాయి. గంధవరానికి చెందిన దేవర నారాయణ అనే గొర్రెలు పెంపకందారునికి గ్రామ సమీపంలో కల్లం ఉంది. అక్కడ రేకుల షెడ్‌లో రోజూలాగే శుక్రవారం రాత్రి తన గొర్రెలను ఉంచి, ఇంటికి వెళ్లిపోయాడు. షెడ్ పక్కనే గల విద్యుత్ స్తంభం నుంచి వచ్చిన విద్యుత్ వైరు.. షెడ్డు చుట్టూ వేసిన ఇనుక కంచెకు తగిలింది.ఆ వైరు ద్వారా విద్యుత్ సరఫరా కావడంతో షాక్‌కు గురై షెడ్డులో ఉన్న గొర్రెలన్నీ మృతి చెందాయి. శనివారం ఉదయం వెళ్లి చూసేసరికి అన్ని గొర్రెలు మృతిచెంది ఉండడంతో నారాయణ భోరున విలపించాడు. సుమారు రూ.4లక్షలు విలువైన గొర్రెలు మృతిచెందడంతో జీవనాధారం కోల్పోయానని నారాయణ కన్నీరుమున్నీరయ్యాడు. గ్రామ సర్పంచ్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పల్లా నర్సింగరావు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ మొల్లి అప్పలనాయుడు, రాష్ట్ర గొర్రెలు, మేకలు పెంపకందారులు సంఘం అధ్యక్షుడు గంటా శ్రీరామ్ బాధితుడిని పరామర్శించారు. మృతిచెందిన గొర్రెలకు స్థానిక పశువైద్యాధికారి పోస్టుమార్టం చేశారు. విద్యుత్‌శాఖ ఏఈ, సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి ప్రమాదం వివరాలు తెలుసుకొని, బాధితుడికి న్యాయం చేస్తామని తెలిపారు.