
మూడు యుద్ధాల్లో ఆరితేరిన యోధుడు
కశింకోట: రోకళ్ల అప్పారావు.. భారత్‌తో పాకిస్తాన్, చైనా జరిపిన మూడు ప్రధాన యుద్ధాల్లో పాల్గొన్నారు. యుద్ధాలతోపాటు ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఇండియన్ ఆర్మీ నుంచి పతకాలు పొందారు. శేష జీవితాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. ఆది నుంచి ఆరోగ్యంతో ఆనందమయ జీవనాన్ని గడుపుతున్నారు. కశింకోటలోని స్టేట్ బ్యాంకు వీధి ప్రాంతంలో అప్పారావు కుటుంబంతో స్థిర నివాసం ఉంటున్నారు. 1955లో 14వ ఏట ఇండియన్‌్ ఆర్మీలో చేరి సిపాయిగా వైర్‌లెస్ విభాగంలో ఆపరేటర్‌గా సేవలందించారు. 1962లో చైనాతోను, 1965, 71 సంవత్సరాల్లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధాల్లో విధులు నిర్వహించారు. తొలుత 1966 వరకు సేవలందించి విధుల నుంచి రిటైర్ అయ్యారు. మళ్లీ యుద్ధం రావడంతో ఇండియన్ ఆర్మీ అధికారుల నుంచి వచ్చిన పిలుపు మేరకు మరోసారి వెళ్లి 1971లో పాకిస్తాన్ యుద్ధంలో సేవలందించారు. జమ్మూ, కశ్మీర్, అస్సాం, రాజస్థాన్, గుజరాత్, జలంధర్ తదితర ప్రాంతాల్లో విధులు నిర్వహించి సేవలందించారు. మూడు ప్రధాన యుద్ధాలు చవి చూసి ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఆయన యుద్ధాల్లోను, సర్వీసులోను అందించిన సేవలకు గుర్తింపుగా ఇండియన్ ఆర్మీ పతకాలను అందజేసి గౌరవించింది. ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాక సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి నిలిపారు. అప్పారావు సొంత గ్రామం ఎస్.రాయవరం మండలం లింగరాజుపాలెం. ఆర్మీలో చేరిన తర్వాత ఇక్కడికి వలస వచ్చి స్థిర నివాసం ఉంటున్నారు.
పాక్ తుక్కుగా ఓడిపోవడం ఖాయం
పాకిస్తాన్‌తో మళ్లీ యుద్ధం వస్తే భారత్ చేతిలో తుక్కుగా ఓడిపోవడం ఖాయమని అప్పారావు ధీమాగా చెప్పారు. సమృద్ధిగా ఆయుధ సంపత్తి, సాంకేతిక పరిజ్ఞానం భారత్‌కు ఉన్నాయన్నారు. ఆర్మీ నుంచి వచ్చిన తర్వాత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తన శేష జీవితాన్ని గడుపుతున్నానన్నారు.