చోడవరం: ఈనెల 12వ తేదీన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, యువతకు ఉద్యోగ కల్పన, నిరుద్యోగ భృతి హామీలు నెరవేర్చని ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వైఎస్సార్‌సీపీ చేపట్టిన యువత పోరు ఆందోళనను అంతా విజయవంతం చేయాల ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడు, చోడవరం సమన్వయకర్త గుడివాడ అమర్‌నాథ్ కోరారు. చోడవరం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ప్రచార వాల్‌పోస్టర్లను సోమవారం వారు ఆవిష్కరించారు. యువత, విద్యార్థుల పక్షాల వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని, ఈ ఉద్యమంలో వారంతా పాల్గొనాలని కోరారు.
విద్యార్థులు, నిరుద్యోగుల తరపున పోరాటం
అనకాపల్లి: చంద్రబాబు పాలనలో దగాపడ్డ విద్యార్థులు, నిరుద్యోగుల తరపున యువత పోరు కార్యక్రమాన్ని ఈనెల 12న నిర్వహిస్తున్నామని వైఎస్సా ర్‌సీపీ యూత్ విభాగం జిల్లా అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్ చెప్పారు. స్థానిక రింగ్‌రోడ్డులోని పార్టీ సమస్వయకర్త మలసాల భరత్‌కుమార్ కార్యాలయంలో సోమవారం యువత పోరు పోస్టర్‌ను ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు బకాయిపడ్డ రూ.4,600 కోట్లు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతి ఏడాది జనవరిలో జాబ్ క్యాలండర్ ఇచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన చంద్రబాబునాయుడు మరో సారి నిరుద్యోగులను మోసగించారన్నారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది మాసాలు అవుతున్నప్పటికీ ఒక్కరికీ రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇవ్వలేదని పేర్కొన్నారు. జిల్లా ఐటీ వింగ్ విభాగం అధ్యక్షుడు పల్లెల వెంకట సీతమ్మదొర మాట్లాడుతూ డీఎస్సీ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి నేటికీ అమలు చేయకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బి.హేమంత్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు ఫీజుల రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడంతో ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యార్థి విభాగం యలమంచిలి అధ్యక్షుడు చదరం అప్పలనాయుడు, వైద్యవిభాగం రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ లక్ష్మీనరసింహరావు, జిల్లా మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మరిపల్లి శోభ, తదితరులు పాల్గొన్నారు.
యువత పోరు హోరెత్తాలి