కళ్ల ముందే ఘోరం

- - Sakshi

● పండంటి కుటుంబంలో తీవ్ర విషాదం ● ఆగి ఉన్న లారీని కారు ఢీకొని తల్లీ కొడుకు మృతి ● పరామర్శకు వెళ్లి వస్తుండగా దుర్ఘటన

నిశి రాత్రి వేళ జరిగిన ఘోర ప్రమాదం ఆ కుటుంబంలో చీకటి నింపింది. బంధువులను పరామర్శించేందుకు వెళ్లి వస్తుండగా ప్రమాదం రూపంలో విధి కాటేసింది. కళ్ల ముందే భార్య, కొడుకును పోగొట్టుకున్న శ్రీనివాసరావు విషాదానికి అంతే లేదు. ‘డాడీ.. మమ్మీకి ఏమైంది? సీట్లోనే అలా ఉండిపోయింది.. కిందకు దిగమనండి.. అన్నయ్యను రోడ్డు మీద పడుకోబెట్టేశారు.. ముఖం నిండా రక్తం వచ్చేస్తోంది.. నాకు భయంగా ఉంది డాడీ.. చేయి నొప్పి పెడుతోంది.. తట్టుకోలేకపోతున్నాను’ అంటూ రోదిస్తున్న ఏడేళ్ల కుమార్తెను ఓదార్చలేక ఆయన కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు చూపరులను కలిచివేసింది.

నక్కపల్లి / పాయకరావుపేట : జాతీయ రహదారిపై పాయకరావుపేట మండలం సీతారామపురం సమీపంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీ కొడుకు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు గాయాలపాలయ్యారు. ఈ దుర్ఘటనతో విశాఖపట్నం జిల్లాలోని మల్కాపురం ప్రాంతానికి చెందిన డాక్‌యార్డ్‌ ఉద్యోగి కోలా శ్రీనివాసరావు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తమ సమీప బంధువు మరణించడంతో దశ దిన కార్యక్రమానికి కోనసీమ జిల్లా గన్నవరం వెళ్లి కారులో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సీతారామపురం వద్ద పెట్రోలు బంకు సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. కారును శ్రీనివాసరావు నడుపుతున్నారు. ముందు సీట్లో కూర్చున్న శ్రీనివాసరావు భార్య కోలా భారతి (44), వెనుక సీట్లో కూర్చున్న అతని కుమారుడు మోహన్‌ బాలాజీ (19) తీవ్ర గాయాలపాలై మరణించారు. భారతి గుండెకు, తలకు తీవ్ర గాయాలవడంతో కారులోనే ప్రాణాలు కోల్పోయింది. మోహన్‌ బాలాజీ తలకు, కంటికి తీవ్ర గాయాలవడంతో 108 వాహనంలో తుని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించాడు. శ్రీనివాసరావుతోపాటు తల్లి వరలక్ష్మి, చెల్లెలు కోలనాటి ధనలక్ష్మి, కుమార్తె హేమ స్ఫూర్తికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని తుని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం గాజువాకలోని కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాలకు నక్కపల్లి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారని ఎస్‌ఐ జోగారావు తెలిపారు.

నిద్రమత్తు వల్లే ప్రమాదమా..?

అర్ధరాత్రి కావడంతో నిద్రమత్తులో రోడ్డుపక్కన ఆగి ఉన్న లారీని గమనించకుండా వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ప్రమాదాన్ని స్థానికులు గుర్తించి వెంటనే 108 వాహనానికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన వాహన సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో కారులో ఇరుక్కున్న వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.

ఘటనా స్థలం వద్ద రోదిస్తున్న చిన్నారి స్ఫూర్తి

తీవ్ర విషాదంలో శ్రీనివాసరావు

Read latest Anakapalle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top