
రికార్డులు పరిశీలిస్తున్న ఎస్పీ గౌతమి సాలి
● నిందితులకు కఠిన శిక్షలు అమలు ● ఎస్పీ గౌతమి సాలి
కె.కోటపాడు: జిల్లాలో గంజాయి తరలింపుపై గట్టి నిఘా పెట్టినట్లుఎస్పీ గౌతమి సాలి అన్నారు. మండలంలో గల ఎ.కోడూరు పోలీస్‌స్టేషన్‌ను బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్ రికార్డులతో పాటు కేసుల్లో పట్టుబడిన సామగ్రిని భద్రపరిచే ఈ–మక్కాన్ గదిని పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతు గంజాయి తరలించే వ్యక్తులను గుర్తించి వారి కదలికలపై నిఘా పెట్టినట్లు తెలిపారు. ఈ కేసుల్లో పట్టుబడిన వారికి కఠిన శిక్షలు అమలు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. మొదటి విడతగా 37 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న చోట్ల రెవెన్యూ సిబ్బందితో వాహనదారులు జాగ్రత్తలు పాటించేటట్లు చర్యలు తీసుకున్నట్లు ఆమె వివరించారు. గతంలో కంటే రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వారి శాతం జిల్లాలో తగ్గిందని అన్నారు. గ్రామాల్లో పోలీస్ శాఖ ద్వారా అందుతున్న సేవలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు ఎస్పీ గౌతమి సాలి తెలిపారు. పోలీస్‌స్టేషన్ పరిసరాలు పచ్చదనంతో నిండి ఉండడంతో సిబ్బందిని ఆమె అభినందిచారు. కార్యక్రమంలో ఎస్‌ఐ బి. రామకృష్ణ పాల్గొన్నారు.