టైంపాస్‌ చేయకండి

- - Sakshi

● పాఠశాలలపై పర్యవేక్షణ ఇలాగేనా? ● విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ ● విశాఖలోని పలు పాఠశాలల తనిఖీ

విశాఖ విద్య: పాఠశాలల పర్యవేక్షణలో మీ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. టైంపాస్‌ చేస్తే అనుకున్న ఫలితాలు ఎలా వస్తాయి? నేనేమైనా టైంపాస్‌ కోసం జిల్లాల్లో పర్యటిస్తున్నానా? అంటూ విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ జిల్లా విద్యాశాఖాధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం నగరంలోని పలు పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. తొలుత ప్రకాశరావు పేట జీవీఎంసీ హైస్కూల్‌ను సందర్శించారు. ఓల్డ్‌ సిటీలోని స్కూళ్ల వివరాలు చెప్పాలని డిప్యూటీ డీఈవో గౌరీ శంకర్‌ను అడిగారు. ఆయన సరైన సమాధానం చెప్పకపోవడంతో.. మీ పరిధిలోని స్కూళ్లు గురించే తెలియకపోతే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగ్లిష్‌ టీచర్‌ను ఇంటర్మీడియట్‌ పరీక్షల ఇన్విజిలేషన్‌ డ్యూటీ వేశారని చెప్పడంతో.. పరీక్షల సమయంలో ప్రాధాన్యం గల సబ్జెక్టు టీచర్లను ఇన్విజిలేషన్‌ డ్యూటీలకు పంపడం ఏంటని డీఈవోను ప్రశ్నించారు. ఇంటర్మీడియట్‌ ఇన్విజిలేషన్‌కు వెళ్లిన ఉపాధ్యాయుల జాబితాను ఇవ్వాలని ఆర్జేడీ జ్యోతికుమారికి ఆదేశించారు. 4వ తరగతి గణితం సబ్జెక్టులో విద్యార్థుల నైపుణ్యతను పరిశీలించి, బోధన బాగుందని ఉపాధ్యాయురాలిని మెచ్చుకున్నారు. అనంతరం క్వీన్‌ మేరీ ప్రభుత్వ బాలికల హైస్కూల్‌ను తనిఖీ చేశారు. 8వ తరగతి డీ–సెక్షన్‌లో 22 మంది విద్యార్థినులు పాఠ్యపుస్తకాలను తీసుకురాకపోవడాన్ని గుర్తించారు.

పర్యవేక్షణ ఇలాగేనా..

రాష్ట్రంలోని మిగతా ఏ జిల్లాలో కూడా విశాఖ లాంటి అనువైన వాతావరణం లేదని, కానీ ఇక్కడ పర్యవేక్షణాధికారుల పనితీరు ఏమాత్రం బాగాలేదని ప్రిన్సిపల్‌ సెక్రటరీ అన్నారు. అర్బన్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌కు ఎక్కడ ఏ స్కూల్‌ ఉందో, ఎవరు లీవ్‌లో ఉన్నారో కూడా తెలియదు అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. పోర్ట్‌ బేసిక్‌ ప్రాథమిక పాఠశాలలో నలుగురు ఉపాధ్యాయులకు ఒకరికి వర్క్‌ అడ్జిస్ట్‌మెంట్‌, మరో ఇద్దరికి మెటర్నిటీ లీవ్‌ ఇచ్చినప్పడు.. అక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం లేదా అని అర్బన్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ సువర్ణపై అసహనం వ్యక్తం చేశారు. వారికి సంబంధించిన సమగ్ర నివేదికను తనకు అందజేయాలన్నారు. పాఠశాల పరిశీలన సమయంలో గుర్తించిన లోపాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

పనితీరు మార్చుకోండి

టైంపాస్‌ మీటింగ్‌లు వద్దని, పనితీరు మెరుగుపరుచుకుని విద్యా కార్యక్రమాల అమలుపై దృష్టి పెట్టాలని ప్రవీణ్‌ ప్రకాష్‌ సూచించారు. ఎన్నిసార్లు చెప్పినా మారకపోతే ఎలా అన్నారు. గుర్తించిన లోపాలపై సంబంధిత ఉపాధ్యాయులు, పర్యవేక్షణాధికారులపై చర్యలు కఠినంగానే ఉంటాయన్నారు. పర్యటనలో ఆర్జేడీ జ్యోతికుమారి, డీఈవో చంద్రకళ, విశాఖ, అనకాపల్లి జిల్లాల డీవీఈవోలు రాయల సత్యనారాయణ, సుజాత, ప్రభుత్వ డైట్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ మాణిక్యం నాయుడు, డీపీఈబీ సెక్రటరీ ఎం.వి.కృష్ణకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Anakapalle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top