
నర్సీపట్నం: మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా సాగింది. పట్టణంలో మెయిన్ రోడ్డు విస్తరణపై వైఎస్సార్‌సీపీ, టీడీపీ కౌన్సిలర్ల మాధ్య వాదులాట జరిగింది. అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్ల అరుపులు, కేకలతో సమావేశం మార్మోగింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 అడుగులకు రోడ్డు విస్తరిస్తున్నట్లు ఎజెండాల్లో పేర్కొన్నారు. దీనిపై టీడీపీ కౌన్సిలర్ చింతకాయల పద్మావతి కల్పించుకుని రోడ్డు విస్తరణకు టీడీపీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని ప్రకటించడంతో, అధికారపక్ష కౌన్సిలర్లు బల్లలు తరుస్తూ ఆనందం వ్యక్తం చేశారు. వెంటనే పద్మావతి మాట్లాడుతూ రోడ్డు విస్తరణ బాధితులకు ప్రభుత్వం ఇచ్చే టీడీఆర్ బాండ్లతో ప్రయోజనం లేదని, నగదు రూపంలో నష్టపరిహారం చెల్లించాలన్నారు. దీంతో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు కోనేటి రామకృష్ణ, మాకిరెడ్డి బుల్లిదొర, బయపురెడ్డి చినబాబు, సిరసపల్లి నాని, బోడపాటి సుబ్బలక్ష్మి, జగదీశ్వరి కల్పించుకుని ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. దీంతో టీడీపీ, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ హయాంలో టీడీఆర్ బాండ్లు ఇవ్వలేదా అని వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు మండిపడ్డారు. దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న విధానాన్ని నర్సీపట్నంలో అమలు చేస్తున్నారు తప్ప కొత్తగా తీసుకురాలేదన్నారు. కమిషనర్ సమాధానం ఇవ్వాలని టీడీపీ కౌన్సిలర్లు పట్టుబట్టారు. కమిషనర్ కనకారావు మాట్లాడుతూ 2014 మాస్టర్ ప్లాన్‌లో వంద అడుగులు పేర్కొన్నారని దాని ప్రకారమే రోడ్డు విస్తరణ జరుగుతుందని వివరణ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం జీవో నెంబరు 180ను అనుసరించి రోడ్డు విస్తరణ బాధితులకు టీడీఆర్ బాండ్లు తప్ప ప్రభుత్వం నగదు రూపంలో నష్టపరిహారం చెల్లించటం లేదని, దేశవ్యాప్తంగా ఇదే విధానం ఉందని కౌన్సిల్‌కు వివరించారు. ఇదే సమయంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి జోక్యం చేసుకుంటూ అసలు మున్సిపాలిటీలో ఏం జరుగుతుందో తనకు తెలియటం లేదని అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు. ఎజెండా సైతం ముందు రోజే ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. వైస్‌చైర్మన్ తమరాన అప్పలనాయుడు జోక్యం చేసుకుని రోడ్డు విస్తరణపై భవన యజమానులు, బాధితులతో చర్చించి నిర్ణయం తీసుకోవటం వల్ల ఎజెండా తయారీ లో ఆలస్యమైంది తప్ప ఉద్దేశ్యపూర్వకంగా జరిగింది కాదని సర్పిచెప్పడంతో చైర్‌పర్సన్ ఏమీ మాట్లాడలేదు. 20వ వార్డు గిరిజన గ్రా మంలో మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ టీడీపీ కౌన్సిలర్ రామరాజు బ్యానర్‌తో కౌన్సిల్‌లోకి ప్రవేశించి నిరసన తెలియజేశారు. శివరాత్రి పేరుతో ఖర్చు చేసిన రూ.10 లక్షలకు సంబంధించి వివరణ ఇవ్వాలని జనసేన కౌన్సిలర్ సౌజన్య డిమాండ్ చేశారు. వాదనలు, ప్రతివాదనలతో సమావేశం ముగిసింది.
సమావేశంలో మాట్లాడుతున్న చైర్‌పర్సన్ ఆదిలక్ష్మి
వైఎస్సార్‌సీపీ, టీడీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం
