
సభకు హాజరైన వేలాది మంది డ్వాక్రా మహిళలు
● బహిరంగ సభలో ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ ● డ్వాక్రా మహిళలకు ఆసరా చెక్కుల పంపిణీ
చోడవరం: మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ అన్నారు. చోడవరం మండలంలో డ్వాక్రా మహిళలకు ఆసరా చెక్కులను బుధవారం అందజేశారు. ఇక్కడ శివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వేలాది మంది డ్వాక్రా మహిళలు హాజరయ్యారు. చోడవరం మండలంలో 2257 డ్వాక్రా సంఘాల్లో 23 వేల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ. 14 కోట్ల 57 లక్షలు మంజూరైంది. ఈ సందర్భంగా ధర్మశ్రీ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు డ్వాక్రా మహిళలకు దశలవారీ రుణమాఫీ చేస్తూ ఆసరా పథకంలో లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. మరో పక్క సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చి ఆ వడ్డీని కూడా ప్రభుత్వమే భరించే విధంగా సహకారం అందిస్తున్నారన్నారు. ఆసరా పథకంలో మంజూరైన వడ్డీ డబ్బులు నేరుగా డ్వాక్రా సంఘాల ఖాతాల్లో జమ చేసి మహిళలకు అండగా ముఖ్యమంత్రి నిలిచారన్నారు. గతంలో చంద్రబాబు పసుపు కుంకుమ పేరుతో మహిళలను మభ్యపెట్టారని, మాఫీ చేస్తామని డ్వాక్రా మహిళలను మోసం చేశారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అన్ని విధాలుగా మహిళలకు అండగా నిలిచారన్నారు. ఇది ప్రచారాల ప్రభుత్వం కాదని, ఇది ప్రజా ప్రభుత్వమని ఆయన అన్నారు. మహిళా సంక్షేమానికి కృషి చేస్తున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి మహిళలంతా మద్దతు పలకాలని ధర్మశ్రీ కోరారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఏరియా కో ఆర్డినేటర్ శ్రీనివాస్, ఎంపీపీ గాడి కాసు అప్పారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏడువాక సత్యారావు, చోడవరం సర్పంచ్ బండి నూకాలమ్మ, మండల అధ్యక్షుడు దొడ్డి వెంకట్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఓరుగంటి నెహ్రూ, పట్టణ అధ్యక్షుడు దేవరపల్లి సత్య, యూత్ ప్రతినిధులు గూనూరు రాజు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

చోడవరం సభలో డ్వాక్రా మహిళలకు ఆసరా చెక్కు అందజేస్తున్న ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ