
సాక్షి, విశాఖపట్నం : ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మె ల్సీ ఎన్నికకు సంబంధించి నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.ఎ.మల్లికార్జున, ఎన్నికల పరిశీలకులు సిద్ధార్ధ్ జైన్ సమక్షంలో శుక్రవారం పరిశీలించారు. ఈ నెల 16వ తేదీ నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి 23వ తేదీ వరకూ మొత్తం 44 మంది అభ్యర్థులు 70 సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ వేసిన అభ్యర్థులు, ఆయా అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో మొత్తం 70 సెట్లు నామినేషన్లను కలెక్టర్ స్క్రూట్నీ చేశారు.
విశాఖ జిల్లాకు చెందిన ఇమామ్ మోహియుద్దీన్ అహ్మద్, రుద్రరాజు కల్యాణ వర్మ నామినేషన్లను తిరస్కరించారు. విజయనగరం జిల్లాకు చెందిన బొలిశెట్టి వెంకటేశ్వరరావు, అనకాపల్లి జిల్లాకు చెందిన కొలుపురి నాగభారతి నామినేషన్లను తిరస్కరించారు. మొత్తం 44 నామినేషన్లకు సంబంధించి నాలుగు నామినేషన్లు తిరస్కరించినట్లు కలెక్టర్ డా. మల్లికార్జున వెల్లడించారు. ఈనెల 27 వరకు నామినేషన్లు ఉపసంహరణకు గడువు ఉందని తెలిపారు.