వైభవంగా మత్స్యమాడుగులమ్మ సంబరం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా మత్స్యమాడుగులమ్మ సంబరం

May 6 2026 7:55 AM | Updated on May 6 2026 7:55 AM

భారీగా తరలివచ్చిన భక్తజనం

భక్తిశ్రద్ధలతో అనుపు ఉత్సవం

జి.మాడుగుల: మండల కేంద్రం జి.మాడుగుల ప్రజల ఆరాధ్య దైవం మత్స్య మాడుగులమ్మ తల్లి సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ ఉత్సవాలకు జిల్లాలోని గిరిజన ప్రాంతాల నుండే కాకుండా, మైదాన ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. గిరిజన సంప్రదాయం ప్రకారం.. మంగళవారం సాయంత్రం మాజీ ఎంపీ దివంగత మత్స్యరాస మత్స్యరాజు స్వగృహం నుంచి ఘటాలను మత్స్యరాస వంశీయులు, భక్తులు ఊరేగింపుగా బయలుదేరారు. వీటిని స్థానిక రామాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సతకం పట్టు వద్దకు తీసుకువచ్చారు. మూడు రోజుల పాటు విశేష పూజలందుకున్న ఈ ఘటాలతో పాటు, అమ్మవారి అనుపు ఉత్సవం గ్రామ పురవీధుల్లో అత్యంత వైభవంగా జరిగింది. డప్పు వాయిద్యాలు, శక్తి వేషధారణలు, తీన్‌మార్‌ స్టెప్పులు, బాణసంచా వేడుకల మధ్య ఈ కార్యక్రమం సాగింది. జాతర సందర్భంగా తెల్లవారుజాము నుంచి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. పరిసర గ్రామాల నుంచి మహిళలు అమ్మవారికి ప్రీతిపాత్రమైన మట్టి ఘటాలను తలపై పెట్టుకొని, డప్పు వాయిద్యాల మధ్య పురవీధుల గుండా వచ్చి ఆలయంలో సమర్పించారు. గంతకొండపై కొలువై ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులు అమ్మవారికి పసుపు, కుంకుమలు, నూతన వస్త్రాలు సమర్పించి భక్తి చాటుకున్నారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రులు మత్స్యరాస బాలరాజు, మణికుమారి, జెడ్పీటీసీ డాక్టర్‌ మత్స్యరాస వెంకటలక్ష్మి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మత్స్యరాస రామరాజు, మాజీ ఎంపీపీ ఎం. వెంకట గంగరాజు, ప్రధాన కార్యదర్శి గసాడి రెడ్డిబాబు, ఎంపీటీసీలు విజయకుమారి, మాజీ పాడేరు మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఎం. గాయత్రి తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి.

Advertisement
 
Advertisement
Advertisement