జర్నలిస్టుల రక్షణకు చట్టం చేయాలి | - | Sakshi
Sakshi News home page

జర్నలిస్టుల రక్షణకు చట్టం చేయాలి

May 6 2026 7:55 AM | Updated on May 6 2026 7:55 AM

కొయ్యూరు: జర్నలిస్టుల సంక్షేమానికి, రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఇండియన్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ జనరల్‌ సెక్రటరీ పి. సోమసుందరం, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి. సుబ్బారావు కోరారు. రాష్ట్రంలో జర్నలిస్టులకు రక్షణ కరువైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో జిల్లా ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు నాగరాజు అధ్యక్షతన జిల్లా ప్రథమ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారు మాట్లాడుతూ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. కోవిడ్‌ సమయంలో అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కరోనా వల్ల మృతి చెందిన కొందరు జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారని వారు గుర్తు చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి జర్నలిస్టుల సమస్యలను వివరించామని తెలిపారు. ముఖ్యంగా ఇళ్ల స్థలాల మంజూరు, అక్రిడిటేషన్ల జారీ వంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు. మన్యం ప్రాంతంలో విలేకరులు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని వారు కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఏపీ ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్రరావు, చింతల కిషోర్‌ ప్రసంగించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సీఐ బి. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జర్నలిస్టులు వాస్తవాలను ప్రతిబింబించాలని, నిజాయితీగా ఉంటూ ప్రజలకు సేవ చేయడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎంపీపీ బడుగు రమేష్‌, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్‌ ప్రసాద్‌, ఎంపీడీవో ప్రసాదరావు, ఎస్‌ఐలు కిషోర్‌ వర్మ, సీదరి శ్రీనివాస్‌లను జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు. ఇలావుండగా జిల్లా అధ్యక్షుడిగా పాడేరుకు చెంతిన ప్రభుదాస్‌, ప్రధాన కార్యదర్శిగా దయానంద్‌, 15 మంది సభ్యులతో కార్యవర్గం ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానిక్‌ మీడియాకు సంబంధించి అధ్యక్షుడిగా ప్రణిత్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శిగా వి.జోషీను ఎన్నుకున్నారు. ఐదుగురు సభ్యులతో కార్యవర్గం ఏర్పాటు చేశారు.

ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే నేతలు

సోమసుందరం, ఐవీ సుబ్బారావు

Advertisement
 
Advertisement
Advertisement