అర్జునగిరి గ్రామస్తుల నిరసన
చీడికాడ : మా గ్రామంలో అర్ధంతరంగా మద్యం దుకాణం ఏర్పాటు వద్దంటూ మండలంలోని అర్జునగిరికి చెందిన గ్రామ పెద్దలు, మహిళలు మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బోడాల రమాదేవి, ఎంపీటీసీ పెంటకోట అమ్మతల్లినాయుడు మాడుగుల వ్యవసాయ కమిటీ డైరెక్టర్ జాజిమొగ్గల ప్రసాద్ మాట్లాడుతూ ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా గ్రామంలో మద్యం దుకాణం ఏర్పాటుకు అధికారులు సిండికేటు నాయకులు కుట్ర పన్నుతున్నారన్నారు. గ్రామంలో నివాసితుల మధ్య ఈ దుకాణం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారని ఆరోపించారు. సిండికేటు నాయకులు వారిలో వారికి ఉన్న విభేదాలతో గ్రామంలో అల్లర్లు సృష్టించేందుకు ఈ దుకాణం ఏర్పాటుకు ముందుకు వస్తున్నారన్నారు. ఈ మద్యం దుకాణం ఇప్పటికే కోణం గ్రామ శివారు గుడివాడలో పెట్టి, అక్కడ నుంచి ప్రస్తుతం చీడికాడలో నిర్వహిస్తున్నారని, ఆ దుకాణాన్నే అర్జునగిరికి మార్చాలని చూస్తున్నారని అన్నారు. దీనిపై మాడుగుల ఎకై ్సజ్ సీఐ ఉపేంద్రతో పాటు, జిల్లా సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేసినట్టు గ్రామస్తులు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, వైఎస్సార్‌సీపీ నేతలు జె.ప్రసాద్, పి.నూకునాయుడు, కె.గణపతి, కె.శ్రీనివాసరావు, టి.అప్పలనాయుడు, జె.సత్యనారాయణ, చొక్కా కుల దాలినాయుడు, చీకటి శివ, పెంటకోట సూరిబాబు, ఎంపీటీసీ పి.అమ్మతల్లినాయుడు పాల్గొన్నారు.


