శ్వాసకు ‘బ్రేక్‌’.. వెంటిలేటర్ల షాక్‌ | - | Sakshi
Sakshi News home page

శ్వాసకు ‘బ్రేక్‌’.. వెంటిలేటర్ల షాక్‌

May 6 2026 7:55 AM | Updated on May 6 2026 7:55 AM

కేజీహెచ్‌లో మూలుగుతున్న వెంటిలేటర్లు 415 యంత్రాలకు పనిచేస్తున్నవి 92 మాత్రమే అత్యవసర విభాగాల్లో అందని వైద్యం గాలిలో కలిసిపోతున్న పేదల ప్రాణాలు పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు

మహారాణిపేట: కేజీహెచ్‌.. ఉత్తరాంధ్ర ప్రజలకే కాక, పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ పేదలకు కూడా ఒక నమ్మకమైన వైద్య కేంద్రం. ప్రస్తుతం ఈ ఆస్పత్రిలో అత్యవసర ప్రాణవాయువును అందించే వెంటిలేటర్ల వ్యవస్థ కుప్పకూలడం రోగుల పాలిట శాపంగా మారింది. రోగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, ఊపిరితిత్తులు సహకరించని సమయంలో శ్వాస అందించేందుకు వెంటిలేటర్‌ ఎంతో కీలకం. ముఖ్యంగా రోడ్డు ప్రమాద బాధితులకు, అగ్నిప్రమాద క్షతగాత్రులకు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి ఇది జీవనాధారం. ఇటువంటి కీలకమైన పరికరాలు మెజారిటీ సంఖ్యలో మూలపడటం ఆందోళన కలిగిస్తోంది.

పరిమితమైన వనరులు

కేజీహెచ్‌లో అధికారికంగా 1,187 పడకలు ఉన్నప్పటికీ, ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య అంతకు రెట్టింపుగా ఉంటోంది. ప్రతిరోజూ సుమారు 2500 మందికి పైగా ఇక్కడ వైద్య సేవలు పొందుతున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు ఓపీ విభాగం కిటకిటలాడుతుంటుంది. నిత్యం వందలాది మంది ఇన్‌పేషెంట్లుగా చేరుతుంటారు. సుమారు 26 విభాగాలు కలిగిన ఈ ఆస్పత్రిలో రోగుల సంఖ్యకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు పెరగకపోగా, ఉన్న సౌకర్యాలు కూడా కంటికి కనిపించకుండా పోతున్నాయి.

92 మాత్రమే పని చేస్తున్నాయి

ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో, అత్యవసర వార్డుల్లో మొత్తం 415 వెంటిలేటర్లు ఉండగా, ప్రస్తుతం అందులో కేవలం 92 మాత్రమే పనిచేస్తుండటం గమనార్హం. మిగిలిన 323 వెంటిలేటర్లు చిన్నపాటి మరమ్మత్తులకు గురయ్యాయి. కోవిడ్‌ సమయంలో కేంద్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో వెంటిలేటర్లను మంజూరు చేసింది. ఆ సమయంలో ఇవి అద్భుతంగా పనిచేసినప్పటికీ, ఆ తర్వాత సరైన నిర్వహణ లేకపోవడంతో పనికిరాకుండా పోయాయి. మరమ్మత్తులు చేయించడంలో అధికారుల అలసత్వం, కొత్త వాటి కొనుగోలులో జాప్యం వెరసి పేద రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.

తక్షణ చర్యలు అవసరం

ఆస్పత్రిలో క్యాజువాలిటీ, ఐసీయూ, ఐఆర్‌సీ, ఈఎండీ, సీసీయూ వంటి కీలక విభాగాల్లో వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉంది. అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఈ యంత్రాలకు మరమ్మత్తులు చేయించాల్సిన అవసరం ఉంది. కలెక్టర్‌ ప్రత్యేక శ్రద్ధ వహించి, నిధుల విడుదల, నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించాలని బాధితులు, ప్రజలు కోరుతున్నారు.

పేదలకు తప్పని ఆర్థిక భారం

కేజీహెచ్‌ వంటి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వెంటిలేటర్‌ సౌకర్యం ఉచితంగా లభిస్తుంది. అదే ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే రోజుకు రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు ఖర్చు అవుతుంది. అంత భారీ మొత్తంలో బిల్లులు చెల్లించలేక, రోగి కోలుకోక నిస్సహాయ స్థితిలో ఉన్న సామాన్యులు మళ్లీ కేజీహెచ్‌కే పరుగులు తీస్తున్నారు. కానీ ఇక్కడకు వచ్చాక వెంటిలేటర్లు అందుబాటులో లేవని తెలిసినప్పుడు వారి ఆవేదన వర్ణనాతీతం.

Advertisement
 
Advertisement
Advertisement