మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం | - | Sakshi
Sakshi News home page

మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం

Apr 15 2026 8:08 AM | Updated on Apr 15 2026 8:08 AM

పెదబయలు: ఈతకు వెళ్లి ముగ్గురు గిరిజన చిన్నారులు మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి, బాధితులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి డిమాండ్‌ చేశారు. మంగళవారం పెదబయలు మండలం, పన్నెడ గ్రామానికి చెందిన మృతులు కోడా ప్రదీప్‌ (10), గల్లోంగి హర్షిత (10), పాంగి బబ్లు (10) కుటుంబ సభ్యులను వారు పరామర్శించి, ఓదార్చారు. బాధిత కుటుంబాలకు వ్యక్తిగత సాయం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిన్న వయసులోనే ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడటం అత్యంత బాధాకరమన్నారు. ఘటన జరిగిన తర్వాత గ్రామ సచివాలయ సిబ్బంది, రెవెన్యూ అధికారులు వచ్చారా? అని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు గుర్తుచేశారు. మృతి చెందిన ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

అధికారులు అప్రమత్తంగా ఉండాలి :

ఇటీవల హుకుంపేట మండలం మాలగుమ్మి జలపాతంలో ముగ్గురు యువతులు మృతి చెందిన ఘటన మరువకముందే.. ఇప్పుడు పెదబయలు మత్స్యగెడ్డలో మరో ముగ్గురు మరణించడం దిగ్భ్రాంతిని కలిగించిందని జల్లిపల్లి సుభద్ర, కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి. ఒంటిపూట బడులు ఉండటం, ఎండల తీవ్రత పెరగడంతో విద్యార్థులు చెరువులు, గెడ్డల వద్దకు వెళ్తున్నారని.. తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రమాదకరమైన జలపాతాలు, గెడ్డలు, పర్యాటక ప్రాంతాల వద్ద పోలీస్‌, రెవెన్యూ, టూరిజం, ఐటీడీఏ అధికారులు తక్షణమే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు ఎంవీవీవీఎస్‌. నర్సింగమూర్తి, జగబంధు, మండల అధ్యక్షులు పాంగి పద్మారావు, నాయకులు సందడి కొండబాబు, గంపరాయి సూరయ్య, డడియా రాంబాబు, రూడ లక్ష్మణరావు, మాజీ సర్పంచ్‌ తిరుపతి, గల్లొంగి మాలన్న తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి డిమాండ్‌

Advertisement
 
Advertisement
Advertisement