అవే అర్జీలు.. పరిష్కారం శూన్యం | - | Sakshi
Sakshi News home page

అవే అర్జీలు.. పరిష్కారం శూన్యం

Apr 14 2026 8:04 AM | Updated on Apr 14 2026 8:04 AM

తుమ్మపాల: కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్‌ కార్యక్రమం పేరుకే పరిమితమైందంటూ ఆవేదన వ్యక్తమవుతోంది. గ్రామ, మండల స్థాయిలో సమస్యలు పరిష్కారంగాక అనేక వ్యయప్రయాసలకోర్చి జిల్లా అధికారుల వద్దకు వస్తే సమస్య తెలుసుకుని తక్షణమే పరిష్కరించకుండా సంబంధిత శాఖ సిబ్బందికిచ్చి చేతులు దులుపుకుంటున్నారంటూ అర్జీదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పదే పదే తమ సమస్యలను కలెక్టరేట్‌లో అధికారుల ముందుంచగా, ఫిర్యాదులను నమోదు చేసి, వాటి స్థితిగతులపై కనీసం పునః పరిశీలన చేయడం లేదని వాపోతున్నారు.

పదే పదే భూసమస్యలపై..

భూ సమస్యలతో పాటు మరికొన్ని సమస్యలు నెలల తరబడి ఎటువంటి పురోగతి లేకపోవడంతో కలెక్టరే దిక్కంటూ కొందరు పదేపదే కలెక్టరేట్‌లో ఫిర్యాదులు చేస్తూనే ఉంటున్నారు. మళ్లీ మళ్లీ కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతూ పరిష్కారం కోసం వేడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీల ద్వారా అప్రమత్తం చేయాలని, తద్వారా అర్జీదారుల సమస్యలు పరిష్కారం అవుతాయని చెబుతున్నారు.

ప్రతి అర్జీని క్షుణ్ణంగా

పరిశీలించి పరిష్కారం : జేసీ

ప్రజలు తమ సమస్యలపై చేసిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో అర్జీదారునితో విచారించి పరిష్కారం చేయాలని జాయింట్‌ కలెక్టరేట్‌ శౌర్యమాన్‌ పటేల్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరం –1, 2లలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌ ), రెవెన్యూ క్లినిక్‌ కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయనతోపాటు జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, ఎన్‌ఏవోబీ, బీజేఆర్‌ఎస్‌ ప్రత్యేక ఉప కలెక్టర్లు మనోరమ, రామమణి, జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ శ్రీనివాస్‌ అర్జీలు స్వీకరించారు. ఈ వారం పీజీఆర్‌ఎస్‌కు 108, రెవెన్యూ క్లినిక్‌కు 173 మొత్తం 281 అర్జీలు వచ్చాయి.

కక్షసాధింపుతో భూసేకరణ

జాబితాలో పేరు తొలగింపు

రికార్డుల్లో 2 ఎకరాల భూమికి బదులు 60 సెంట్లు మాత్రమే భూసేకరణ జాబితాలో ఉందని, మిగిలిన భూమి ఆన్‌లైన్లో కనిపించడం లేదని పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసినందుకు రెవెన్యూ అధికారులు తన పేరును పూర్తిగా తొలగించారంటూ మాకవరపాలెం మండలం రాచపల్లికి చెందిన బొంతు రమణ మళ్లీ ఫిర్యాదు చేశాడు. సర్వే నంబరు 737లో 2 ఎకరాల భూమిని 15 సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాను. ఇటీవల ప్రభుత్వం వివిధ కంపెనీల స్థాపన కోసం చేపట్టిన భూసేకరణ ప్రక్రియలో భాగంగా లబ్ధిదారుల జాబితాను తయారు చేసి తహసీల్దార్‌ కార్యాలయంలో ప్రచురించారు. ఆ జాబితాలో మొదటి దఫా నా పేరున ఉన్నప్పటికీ రెండవ జాబితాలో తొలగించారని ఆవేదన వ్యక్తం చేశాడు. భూములు లేని కొంతమంది వ్యక్తులు అక్రమంగా హక్కులు చూపుతూ జాబితా సిద్ధం చేశారన్నారు. భూ సేకరణ జాబితాలో తికమకలపై మరికొందరు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదులు చేశారు.

చెరువు గర్భం ఆక్రమించినా

పట్టించుకోని అధికారులు

మూడు గ్రామాలకు చెందిన చెరువు గర్భాన్ని ఆక్రమించి మట్టితో కప్పేస్తున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని మల్లవరం కాలువ చైర్మన్‌ ఎస్‌.వి.కె.దొర పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశాడు. మాకవరపాలెం మండలం మల్లవరం, గిడుతూరు, వజ్జరగడ గ్రామాలకు చెందిన చెరువు ఆక్రమణపై నర్సీపట్నం ఇరిగేషన్‌ అధికారులకు ఫిర్యాదు చేపినా పట్టించుకోవడం లేదని వాపోయాడు. 750 ఎకరాలకు సాగు నీరందించే చెరువును కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా ఆక్రమించి కొంత భాగాన్ని మట్టితో కప్పేస్తున్నా పట్టింకునే వారే లేకుండా పోయారని, కలెక్టరమ్మ స్పందించి చెరువును కాపాడాలని కోరారు.

తూతూమంత్రంగా మారిన

కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌

అర్జీలు స్వీకరించి చేతులు

దులుపుకుంటున్న అధికారులు

ఆవేదన వ్యక్తం చేస్తున్న అర్జీదారులు

Advertisement
 
Advertisement
Advertisement