సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఇన్‌చార్జి డీఎస్పీ శ్రీనివాసులు
క్లూస్ టీమ్ సిబ్బంది ఆధారాలు సేకరణ
ప్రేమ పేరుతో యువకుడు మోసగించడంతోనే ఆత్మహత్య
పోలీసులకు మృతురాలి తండ్రి పెంటయ్య ఫిర్యాదు
దేవరాపల్లి : మండల కేంద్రంలో సోమవారం రాత్రి అనంతగిరి మండలం కొరపర్తికి చెందిన గిరిజన యువతి దూసరి లక్ష్మి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం విచారణ చేపట్టారు. అనకాపల్లి ఇన్‌చార్జి డీఎస్పీ ఈ.శ్రీనివాసులు, కె.కోటపాడు సీఐ కె.కృష్ణ, స్థానిక ఎస్‌ఐ వి.సత్యనారాయణ ఘటనా స్థలాన్ని మంగళవారం పరిశీలించారు. యువతి ఉరి వేసుకున్న గదిలో క్లూస్ టీమ్ సిబ్బంది ఆధారాలు సేకరించారు. దేవరాపల్లికి చెందిన యువకుడు కొల్లి లోకేష్ ప్రేమ పేరుతో వంచించి మోసం చేయడాన్ని తట్టుకోలేక తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని తండ్రి పెంటయ్య ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారని ఎస్‌ఐ వి.సత్యనారాయణ తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, మృతురాలి కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు మంళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌కు అధిక సంఖ్యలో తరలివచ్చి లక్ష్మి మృతికి కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎస్టీ కులానికి చెందిన యువతి కావడంతోనే సదరు యువకుడు పెళ్లికి నిరాకరించాడని, దీనిని తట్టుకోలేక తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుందని మృతురాలి బంధువులు ఆరోపించారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలుస్తూ తల్లిదండ్రులను ఇద్దరు తమ్ముళ్లు, చెల్లిని పోషిస్తున్న లక్ష్మి మృతితో ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న మాట్లాడుతూ గిరిజన యువతి మృతిపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ రక్షణ చట్టం కింద పరిహారం, బాధిత కుటుంబానికి రూ.25 లక్షల నష్ట పరిహారం, రెండు ఎకరాల భూమి, కుటుంబ సభ్యుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కె.కోటపాడు సీహెచ్‌సీలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మంగళవారం సాయంత్రం కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు.


