బీఎన్‌రోడ్డు కేసులో కోర్టు వాయిదాకు గైర్హాజరు | - | Sakshi
Sakshi News home page

బీఎన్‌రోడ్డు కేసులో కోర్టు వాయిదాకు గైర్హాజరు

Mar 8 2026 7:41 AM | Updated on Mar 8 2026 7:41 AM

● సీఎస్‌, కలెక్టర్‌తో సహా 10 మంది అధికారులకు నోటీసులు

చోడవరం: అత్యంత ఘోరంగా దెబ్బతిని ఎన్నో ప్రమాదాలకు కారణమవుతున్న బీఎన్‌రోడ్డు మరమ్మతుల జాప్యంపై కోర్టు కేసులో శనివారం జరిగిన వాయిదాకు ఆర్‌అండ్‌బీ అధికారులు, కాంట్రాక్టర్‌ గైర్హాజరయ్యారు. దీనితో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ, ఆర్‌అండ్‌బీ శాఖ చీఫ్‌ సెక్రటరీ, జిల్లా కలెక్టర్‌, రోడ్డు కాంట్రాక్టర్‌తోపాటు 10 మంది జిల్లా, డివిజన్‌, మండల స్థాయి అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28వ తేదీ వాయిదాకు హాజరు కావాలని అందులో పేర్కొంది. భీమిలి వయా వెంకన్నపాలెం, చోడవరం, వడ్డాది, కొత్తకోట మీదుగా నర్సీపట్నం (బీఎన్‌రోడ్డు) మెయిన్‌రోడ్డు 57 కిలోమీటర్ల మేర పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంతో ఈ రోడ్డు పనులు ఇప్పటి వరకూ పూర్తి కాలేదు. చంద్రబాబు ప్రభుత్వం సైతం పట్టించుకోకపోవడంతో చివరికి చోడవరం న్యాయవాదులు, పలు స్వచ్ఛంద సంస్థలు న్యాయ పోరాటం చేసేందుకు దిగారు. దీనిలో భాగంగా చోడవరంలో 9వ అదనపు జిల్లా కోర్టులో న్యాయవాదులు అన్నాబతుల భరత్‌ భూషణ్‌, భూపతి రాజు, ఆర్క్‌ స్వచ్ఛంద సంస్థలు వారు వేర్వేరుగా గతేడాది జులై 7వ తేదీన పిటీషన్‌ దాఖలు చేశారు. ఇందులో భాగంగా శనివారం వాయిదాకు ఆర్‌అండ్‌బీ అధికారులు, కాంట్రాక్టర్‌ హాజరుకాలేదు. దీనితో రోడ్డు పనులపై వారికి ఏమాత్రం శ్రద్ధ ఉందో అర్థమవుతోందని, ప్రస్తుత రోడ్డు పనుల్లో నిర్లక్ష్యంపై కోర్టుకు వివరించినట్టు పిటీషనర్‌ తరపున న్యాయవాది, చోడవరం బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు కాండ్రేగుల డేవిడ్‌ చెప్పారు.

తుమ్మపాల నుంచి వెంకన్నపాలెం వరకూ తారు రోడ్డు వేసినప్పటికీ బీఎన్‌రోడ్డులో వెంకన్నపాలెం నుంచి వయా చోడవరం, వడ్డాది, కొత్తకోట, రోలుగుంట వరకూ పూర్తిగా వేయలేదన్నారు. వడ్డాది నుంచి మాడుగుల వరకూ రోడ్డును పూర్తిగా వేయలేదని చెప్పారు. రోడ్డు మధ్యలో కల్వర్టులు, విజయరామరాజుపేట వద్ద వంతెన నిర్మాణ పనులు కనీసం మొదలు పెట్టలేదన్నారు. ఈ విషయాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లామన్నారు. గత వాయిదాలో మార్చి నెలాఖరులోగా పూర్తి చేస్తామని చెప్పిన ఆర్‌అండ్‌బీ అధికారులు ఇప్పటి వరకూ ప్రాథమిక దశ పనులు పూర్తిచేయలేదని, ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లామన్నారు. మండల లీగల్‌ సర్వీస్‌ అథారిటీ చైర్మన్‌, 9వ ఏడీజే కోర్టు న్యాయమూర్తి దీనిపై పరిశీలించి పై విధంగా నోటీసులు జారీ చేశారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement