పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం
ముంచంగిపుట్టు: మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల–1లో 2002–2003 టెన్త్ బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది.అల్లూరి ,విశాఖపట్నం ,అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం,హైదరాబాద్ తదితరు ప్రాంతాల నుంచి సుమారు 68 మంది పూర్వ విద్యార్థులు సమావేశమయ్యారు. 22 సంవత్సరాల తరువాత కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.అలనాటి జ్ఞాపకాలను, మధుర స్మతులను నెమరు వేసుకున్నారు. మండలంలో గల ఏనుగురాయి పంచాయతీ పర్తాపుట్టులో ప్రైవేట్ మీటింగ్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. రానున్న రోజుల్లో ప్రతి ఏడాది పాఠశాలలో అందరూ కలవాలని నిర్ణయం తీసుకున్నారు. అలనాటి గురువులైన ప్రకాశ్, జేఎస్‌ఎన్‌మూర్తి, గోపిక్రిష్ణ, దాలయ్యబాబు, నారాయణ, రమణమూర్తి, రాంబాబు, చలపతిరావు, ప్రసాదరావు, జానకిరావు, అప్పలకొండ, వెంకటలక్ష్మీ, జోగారావు, నాగరాజు,భాగత్‌రాం, అక్కరావు, నాగలక్ష్మీ, జోగారావు, గోపికృష్ణలను ఆహ్వానించి శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందించి ఘనంగా సత్కరించారు. గురువుల నుంచి ఆశీర్వాదాలు పొందారు. గురువులతో కలిసి పూర్వ విద్యార్థులు థింసా నృత్యాలు చేశారు.


