
ముగిసిన పవిత్రోత్సవాలు
డాబాగార్డెన్స్ (విశాఖ): నాలుగు రోజులుగా కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న పవిత్రోత్సవాలు శుక్రవారంతో ముగిసాయి. ఈ సందర్భంగా ఉదయం 8 గంటల నుంచి విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, పవిత్ర అవరోహనం, మహా పూర్ణాహుతి, ఆశీర్వచనం జరిపారు. దేవస్థానం వేదపండితులు, అర్చకుల పర్యవేక్షణలో పవిత్రోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో కె.శోభారాణి, ఏఈవో కె.రాజేంద్రకుమార్, వేదపండితులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
రేపు ఆలయ మూసివేత..
ఈ నెల 7న చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం 1 నుంచి మరుసటి రోజు (8వ తేదీ) ఉదయం 7 గంటల వరకు ఆలయం మూసివేయనున్నట్టు ఈవో శోభారాణి తెలిపారు. అలాగే దర్శనాలు నిలిపివేయనున్నట్టు పేర్కొన్నారు. గ్రహణానంతరం సోమవారం తెల్లవారు జామున సంప్రోక్షణ నిర్వహించి, అమ్మవారికి 5 గంటల ప్రాత:కాల పంచామృతాభిషేకం అనంతరం ఉదయం 7 గంటల నుంచి దర్శనాలకు అనుమతించనున్నట్టు చెప్పారు. భక్తులు గమనించాలని ఈవో శోభారాణి కోరారు.

ముగిసిన పవిత్రోత్సవాలు