
మరో అటవీ అధికారిపై చర్యలకు రంగం సిద్ధం
అడ్డతీగల: ౖరెతు పొలంలో టేకు చెట్లు అనుమతులు లేకుండా నరికి రవాణా చేసిన వ్యవహారంలో మరో అటవీ అధికారిపై కూడా చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మండలంలోని పెద్దమునకనగడ్డలోని రైతు పొలంలో నరికి రవాణా చేసిన 25 టేకు చెట్లు వ్యవహారంలో ఆది నుంచి అటవీ నిబంధనలకు అధికారులు నీళ్లొదిలారు. రైతు వారీ టేకుచెట్ల అక్రమ నరికివేతకు సహకరించి, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారనే కారణంతో అడ్డతీగల అటవీ క్షేత్రం పరిధిలో పనిచేస్తున్న అడ్డతీగల డీఆర్వో రాజారావు, వేటమామిడి బీటు ఆఫీసర్ బసవయ్యను సస్పెండ్ చేయడం తెలిసిందే. ఈ వ్యవహారంలో మరో అటవీఅధికారి చేతివాటం ప్రదర్శించినట్టుగా ఉన్నతాధికారులు గుర్తించారు. సామిల్లులో పట్టుకున్న కలపకు స్క్వాడ్ డీఎఫ్‌వో రూ.3.60 లక్షలు సీఫీజు విధించారు. అయితే తాము రూ.60 వేలు సీఫీజుతో పాటు అటవీ అధికారికి రూ.3లక్షలు లంచంగా ఇచ్చామని ఈ సందర్భంగా కలప వ్యాపారులు ఆయన దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన రాజమహేంద్రవరం కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌కు నివేదించారు. దీనిపై గోప్యంగా విచారణ జరుగుతోంది. లంచం తీసుకున్న అటవీ అధికారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రూ.3 లక్షలు లంచం తీసుకున్నట్టుగా అభియోగం
గోప్యంగా విచారణ జరుపుతున్న
ఉన్నతాధికారులు
ఇప్పటికే ఇద్దరు సస్పెన్షన్