
సర్కారు వైద్యం గగనం
రంపచోడవరం: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం.. గగనంగా మారింది. సరైన వసతులు లేక.. వైద్యులు లేక సేవలు అందని పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా సర్కారు ఆస్పత్రుల్లో పరిస్థితి దయనీయంగా దర్శనమిస్తోంది. ఆస్పత్రి ప్రసవాలు సురక్షతమని ప్రకటనలు గుప్పిస్తున్నా...అందుకు వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. ఆస్పత్రికి ప్రసవానికి వచ్చి మృత్యువాత పడుతున్న సంఘటనలు గిరిజనులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
వైద్యుల నిర్లక్ష్యం
ఇటీవల రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి ప్రసవం కోసం వై.రామవరం మండలం జాజిగడ్డ గ్రామానికి చెందిన కాకూరి పార్వతి వచ్చారు. 13 రోజుల పాటు పాటు ఆమెను ఇక్కడే ఉంచారు. సాధారణ ప్రసవం చేశారు. బిడ్డ జన్మనించిన వెంటనే ఆమె మృతి చెందింది. మొదటి సాధారణ ప్రసవం రాజమహేంద్రవరం ఆస్పత్రిలో జరిగింది. రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో రెండు ప్రసవం సమయంలో వైద్యుల నిర్లక్ష్యం వలనే తన భార్య చనిపోయినట్టు భర్త దుర్గాప్రసాద్ ఆరోపిస్తున్నారు. ఈ ఆస్పత్రిలో ఇది రెండు సంఘటన కావడం శోచనీయం. నాలుగు నెలలు క్రితం మారేడుమిల్లి మండలం రామన్నవలస గ్రామానికి చెందిన గర్భిణి ప్రసవం కోసం రంపచోడవరంలోని బర్త్ వెయింటింగ్ హాలుకు వచ్చారు. ఐదారు రోజులు ఉన్న తరువాత ప్రసవం చేయగా తల్లిబిడ్డ మృతి చెందారు. దీనిపై అప్పుడు మృతురాలు బంధువులు ఆందోళన చేశారు. దీనిపై ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం, సబ్ కలెక్టర్ కె.ఆర్.కల్పశ్రీలు ఆసుపత్రిని సంబంధించి సదరు సంఘటనకు సిబ్బందిని బాధ్యులను చేస్తు సస్పెండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు.అయితే ఇటీవల రంపచోడవరంకు చెందిన గర్భిణి ప్రసవం కోసం ఏరియా ఆస్పత్రికి రాగా హైరిస్క్ కేసుగా పరిగణించి 108లో రాజమహేంద్రవరం రిఫర్ చేశారు. అయితే ఏరియా ఆసుపత్రికి 13 కిలోమీటర్లు వెళ్లిన తరువాత గర్భిణికి పురిటినొప్పులు ఎక్కువ కావడంతో 108 సిబ్బంది, దగ్గరలోనే సీతపల్లి పీహెచ్‌సీ నర్సులు రోడ్డు పక్కన వాహనాన్ని నిలిపి పురుడు పోశారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. వారిని తిరిగి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో పరిస్థితులు బట్టి సేవలందిస్తున్నారని, లేనిపక్షంలో వేరే ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఏరియా ఆసుపత్రిపై నమ్మకంతో వస్తున్న గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించి సుఖ ప్రసవం చేయాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని, అయితే ఇక్కడ వైద్యుల కొరత ఉండడంతో సేవలు అంతంతమాత్రంగానే ఆందుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
భర్తీ కాని పోస్టులు
రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ మూడు గైనకాలజిస్టులు ఉండాల్సి ఉండగా ఒక్క పోస్టు మాత్రమే ఉంది. అలాగే జనరల్ మెడిసిన్ రెండు పోస్టులకుగాను రెండు ఖాళీగా ఉన్నాయి. జనరల్ సర్జన్ రెండు పోస్టులకు ఒకటి ఖాళీగా ఉంది. కొంతమంది వైద్యులు ఆస్పత్రి సమీపంలో క్వార్టర్స్‌లో నివాసం ఉండకుండా రాజమహేంద్రవరం, ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆస్పత్రికి ప్రతి రోజు సుమారు వంద మందికి పైగా అవుట్ పేషేంట్‌లు, 50 నుంచి 60 మంది వరకు ఇన్ పేషేంట్‌లు ఆస్పత్రిలో ఉంటారని చెబుతున్నారు. పూర్తిస్థాయిలో వైద్యులు లేక అరకొరగానే వైద్య సేవలందుతున్నాయన్నారు.
చర్యలు తీసుకోవాలి
రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా పార్వతి మృతి చెందినట్టు ఆదివాసీ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు తీగల బాబురావు ఆరోపించారు.పార్వతి మృతికి కారకులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోమవారం గిరిజనులతో కలిసి ఐటీడీఏ ఎదుట ఆందోళన నిర్వహించారు. ప్రసవం జరిగిన తరువాత పార్వతి మృతి చెందితే ఆ విషయాన్ని బయటకు తెలియకుండా గోప్యంగా ఉంచడానికి గల కారణం ఏమిటన్నారు. కలెక్టర్ దినేష్‌కుమార్ మతాశిశు మరణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నా వైద్యుల్లో మాత్రం మార్పులేదన్నారు. ఏరియా ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంపై ఈ నెల 21న రంపచోడవనం ఐటీడీఏను ముట్టడిస్తామన్నారు.
రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో
అరకొరగా సేవలు
వైద్యులు లేరు..వైద్యం అందదు
తప్పనిసరి పరిస్థితుల్లో రిఫర్ చేస్తున్నాం
ఏరియా ఆసుపత్రికి వచ్చిన రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. తప్పని పరిస్దితిలో సీటీ స్కాన్ తీయవాల్సిన కేసులను రాజమహేంద్రవరం రిఫర్ చేస్తున్నాము. పూర్తిస్థాయిలో వైద్య సేవలందించడానికే ప్రయత్నిస్తున్నాం. ప్రసవం తరువాత అధిక రక్త స్రవం కావడంతోనే పార్వతి మృతి చెందింది. పూర్తిస్థాయిలో గైనకాలజిస్టు ఇతర ఖాళీ పోస్టులు భర్తీ చేస్తే బాగుంటుంది.
–డా. శేషిరెడ్డి, ఆస్పత్రి సూపరిండెంటెంట్, రంపచోడవరం ఏరియా ఆస్పత్రి

సర్కారు వైద్యం గగనం

సర్కారు వైద్యం గగనం