
రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు కృషి
విశాఖ సిటీ : రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు కృషి చేయాలని సోలార్ వెండర్లు, బ్యాంకులు, అధికారులకు ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి సూచించారు. సోమవారం విశాఖ సర్కిల్ కార్యాలయంలో వెండర్లు, బ్యాంకులు, ఈపీడీసీఎల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని వార్డులు, గ్రామ పంచాయతీల్లో పీఎం సూర్యఘర్ పథకంపై అవగాహన కార్యక్రమాలు సమన్వయంతో నిర్వహించాలన్నారు. నగరంలో 200 యూనిట్ల కంటే ఎక్కువగా విద్యుత్‌ను వినియోగిస్తున్నవారు 1.83 లక్షలకు పైగా ఉన్నప్పటికీ.. నగరంలో కేవలం 2,200 మాత్రమే రూఫ్‌టాప్ సోలార్‌ను ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. అపార్టమెంట్ల కామన్ సర్వీసులకు రూఫ్ టాప్ కచ్చితంగా ఏర్పాటు చేయించడంతో పాటు, వర్చువల్ నెట్ మీటరింగ్ పద్ధతిలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. వినియోగదారులు తమ ఇంటి మిద్దైపె సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకుని సున్నా విద్యుత్ బిల్లులను పొందే అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఒక కిలోవాట్ సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్న వారికి రూ.30 వేలు, 2 కిలోవాట్లకు రూ.60 వేలు, 3 కిలోవాట్లకు గరిష్టంగా రూ.78 వేల వరకు సబ్సిడీ లభిస్తుందని, బీసీలకు అదనంగా రూ.20 వేలు సబ్సిడీ లభిస్తుందని తెలిపారు. ఈ పథకానికి బ్యాంకులు ఏడు శాతం వడ్డీతో 90 శాతం రుణం ఇస్తున్నాయన్నారు. ఒక్కసారి పెట్టుబడితో 20 ఏళ్ల వరకు ఇంటికి సరిపడా విద్యుత్ వినియోగించడంతో పాటు, వాడుకోగా మిగిలిన అదనపు విద్యుత్‌ను విద్యుత్ సంస్థకు విక్రయించడం ద్వారా అదనపు ఆదాయాన్ని కూడా పొందవచ్చన్నారు.
కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ (ఆపరేషన్స్) టి.వి.సూర్యప్రకాష్, సీజీఎం బి.సులేఖరాణి, ఎస్‌ఈ జి.శ్యాంబాబు, ఎస్‌బీఐ లీడ్ మేనేజర్ శ్రీనివాస్, ఏపీజీవీబీ రీజినల్ మేనేజర్ చిరంజీవి, ఈఈలు, సోలార్ వెండర్లు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి