
సముద్ర వాణిజ్యానికి చిరునామా బంగాళాఖాతం
● నేటి నుంచి విశాఖ నగరంలో బిమ్స్ టెక్ సమ్మిట్ ● విశాఖ పోర్టు ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహణ ● బ్లూ ఎకానమీ, సుస్థిర ఆవిష్కరణ భాగస్వామ్యం థీమ్ తో సదస్సు
సాక్షి, విశాఖపట్నం: భారత దేశానికి వ్యూహాత్మకంగా అత్యంత కీలక ప్రాంతంగా బంగాళాఖాతం రూపాంతరం చెందుతున్న తరుణంలో.. సముద్ర వాణిజ్యానికి చిరునామాగా ఈ అఖాతాన్ని మార్చేందుకు దక్షిణాసియా దేశాలు మరోసారి ఒకే వేదికపైకి రాబోతున్నాయి. అంతర్జాతీయ వ్యాపారానికి, చమురు, ఖనిజ రవాణాకు ప్రత్యేక వాణిజ్య కేంద్రంగానూ, భద్రత పరంగానూ భౌగోళికంగా అభివృద్ధి చెందింది. దక్షిణాసియా దేశాలన్నీ ప్రాంతీయ శక్తిగా ఎదిగేందుకు దౌత్య, వాణిజ్య, పర్యాటకం, సాంకేతికత, జలరవాణా రంగాల్లో ఆధిపత్యాన్ని సాధించేందుకు రెండో సారి విశాఖ వేదికగా బిమ్స్‌టెక్ కాంక్లేవ్ జరగనుంది. బ్లూ ఎకానమీ, సుస్థిర ఆవిష్కరణల భాగస్వామ్యం అనే థీమ్‌తో జరిగే సదస్సులో దక్షిణాసియాకు చెందిన ఏడు దేశాల ప్రతినిధులు హాజరవుతుండగా.. విశాఖఫట్నం పోర్టు ఆతిథ్యమివ్వనుంది. బంగాళాఖాతం తీర ప్రాంత అభివృద్ధి, నౌకాశ్రయ సహకారం, బ్లూ ఎకానమీలో పెట్టుబడులు వంటి అంశాల్లో బిమ్స్‌టెక్ (బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ–సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్) కీలకంగా మారింది. ఈ సహకారాన్ని మరింతగా బలోపేతం చేసుకునేందుకు విశాఖ పట్నం పోర్ట్ అథారిటీ (వీపీఏ) ఆధ్వర్యంలో సోమ,మంగళవారాల్లో నగరంలో బిమ్స్‌టెక్ కాంక్లేవ్–2025 రెండో ఎడిషన్ జరగనుంది. బంగ్లాదేశ్, భూటాన్, భారత్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్ దేశాలకు చెందిన సంబంధిత మంత్రిత్వ శాఖల ప్రతినిధులు, పోర్టుల అధికారులు, షిప్పింగ్ నిపుణులు, పారిశ్రామిక ప్రతినిధులు సదస్సులో భాగస్వామ్యం కానున్నారు. బంగాళాఖాతం కేవలం సముద్ర ప్రాంతం మాత్రమే కాదనీ.. ఆసియా – దక్షిణాసియా దేశాల వ్యూహాత్మక సంబంధాల మార్గమని చాటిచెప్పేలా బిమ్స్‌టెక్ నిర్వహిస్తున్నారు.
గ్రీన్ ఎనర్జీ.. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌పై దృష్టి
సదస్సులో భాగంగా సభ్య దేశాల్లో ప్రైవేట్ పెట్టుబడులు, మౌలిక వసతుల అభివృద్ధికి సహకారం, మల్టీ మోడల్ ట్రాన్సిట్ కారిడార్ ను వేగవంతం చేయడం, తీరప్రాంత పర్యాటక మార్గాలు, వారసత్వ క్రూయిజ్‌ల అభివృద్ధి, పోర్ట్ మానవ వనరుల పునరుద్ధరణ, నైపుణ్యాభివృద్ధిపై చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా.. అన్ని రంగాల్లోనూ కృత్రిమ మేథ రాజ్యమేలుతున్న నేపథ్యంలో.. గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ద్వారా బ్లూ ఎకానమీని ముందుకు తీసుకెళ్లడం ఎలా అనే అంశాలపై దక్షిణాసియా దేశాలు కీలకంగా చర్చించనున్నాయి. రెండు రోజుల సదస్సు అనంతరం తీర్మానాలతో పాటు వివిధ దేశాల మధ్య వాణిజ్య, పర్యాటక, వ్యూహాత్మక భాగస్వామ్యాల కోసం ఎంవోయూలు జరగనున్నాయి. సదస్సులో సభ్య దేశాల రవాణా, జలరవాణా, పోర్టుల శాఖ మంత్రులు, సంబంధిత మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు, షిప్పింగ్ సంస్థలు, పోర్ట్ ట్రస్టులు, లాజిస్టిక్స్ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు.
కేంద్రమంత్రి శర్బానందని ఆహ్వానిస్తున్న పోర్టు చైర్మన్
అంగమత్తు