
వరద ప్రభావిత ప్రాంతాల్లో పీవో సుడిగాలి పర్యటన
కూనవరం: గోదావరికి వరద పెరుగుతున్న నేపథ్యంలో చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ శనివారం సుడిగాలి పర్యటన చేశారు. వరద ప్రభావిత గ్రామాలైన చినార్కూరు, పైదిగూడెంలో ప్రజలు ముందస్తుగా ఏర్పాటు చేసుకుంటున్న రిలీఫ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. కూటూరు పీహెచ్‌సీ, కోతులగుట్ట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను సందర్శించారు. పైదిగూడెం సమీపంలో ఉన్న రిలీప్ కేంద్రంలో మూడవ బోరు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ భానుప్రకాష్‌ను ఆదేశించారు. కూటూరు పీహెచ్‌సీలో జనరేటర్ ఏర్పాటు చేయడమే కాకుండా మందులు అందుబాటులో ఉంచాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ పుల్లయ్యను ఆదేశించారు. కోతులగుట్ట సీహెచ్‌సీలో అవసరమైన సౌకర్యాల గురించి సూపరింటెండెంట్ డాక్టర్ మహేష్ బాబు అడిగి తెలుసుకున్నారు. అడ్డతీగల, చింతూరు నుంచి ఇద్దరు డాక్టర్లను నియమించి వైద్యుల కొరత లేకుండా చేస్తామన్నారు. అనంతరం స్థానిక తహసీల్దారు కార్యాలయంలో నాటు పడవల నిర్వాహకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వరదల సమయంలో ప్రతీ బోటులో లైప్‌జాకెట్లు ఉండాలని సూచించారు. అలాగే బోటు యజమానులకు రైన్ కోటు, టోపీ, టార్చిలైట్లను ఐటీడీఏ ద్వారా అందిస్తామని తెలిపారు. ఆయన వెంట రంపచోడవరం ఎస్‌డీసీ అంబేద్కర్, ఎటపాక ఎస్‌డీసీ బాల కృష్ణారెడ్డి, ట్రైబల్‌వెల్ఫేర్ ఈఈ మురళి, తహసీల్దార్ కె శ్రీనివాసరావు, ఎంపీడీవో జగన్నాధం, ఎస్‌ఐ లతశ్రీ పాల్గొన్నారు.
వీఆర్‌పురం: వరద ఉధృతి కారణంగా మండలంలో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తుష్టివారిగూడెం– అడవివెంకన్నగూడెం, చింతరేగుపల్లి– కన్నాయిగూడెం, పోచవరం– ఇప్పూరు గ్రామాల మధ్య నీటమునిగాయి. దీంతో 60 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
● వరద ప్రభావిత ప్రాతాల్లో చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ పర్యటించారు. దీనిలో భాగంగా ముందుగా ఆయన ముంపునకు గురయ్యే ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం అధికారులకు సూచనలు చేశారు. చింతూరు ఐటీడీఏ ఏపీవో జగన్నాథరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అంబేద్కర్ బాలకృష్ణారెడ్డి, డీఎంహెచ్‌వో పుల్లయ్య తహసీల్దార్ సరస్వతి, ఎంపీడీవో ఇమ్మానియేల్, ఎస్‌ఐ సంతోష్ కుమార్ పాల్గొన్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో పీవో సుడిగాలి పర్యటన