
ఆక్రమణలు తొలగించి.. మాట నిలుపుకోండి
పాడేరు : ఏజెన్సీ ప్రధాన కేంద్రాలతోపాటు పాడేరు పట్టణంలో రోజురోజుకు పెరిగిపోతున్న ఆక్రమణలు, అక్రమ కట్టడాలను తొలగించడంలో ఇచ్చిన మాటను కలెక్టర్ దినేష్‌కుమార్ నిలుపుకోవాలని గిరిజన సంఘ నేత డాక్టర్ తెడబారికి సురేష్‌కుమార్ కోరారు. శనివారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాడేరు పట్టణంతో పాటు ఏజెన్సీ ప్రధాన కేంద్రాల్లో ఆక్రమణలను తొలగిస్తామని, పట్టణంలో వంద అడుగుల మేర రోడ్డును విస్తరిస్తామని, కోర్టు ఆదేశాలను అమలు చేస్తామని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆరు వారాల క్రితం పాడేరు పాత బస్టాండ్‌లో అంబేడ్కర్ సెంటర్ వద్ద మీడియా సమావేశంలో వెల్లడించారన్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఎనిమిది వారాల్లో ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారని కానీ ఒక్క వారం మాత్రమే హడావుడి చేసి ఆ తరువాత నుంచి కాలయాపన చేశారన్నారు. కూటమి నాయకులు, వర్తకుల దుకాణాలు పోతాయనే కారణంతోనే ఆక్రమణల తొలగింపు నిలిపివేశారని ఆరోపించారు. ఆక్రమణలను తొలగించి రోడ్డు విస్తరణ చేపట్టాలని పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు గత ఐదు వారాలుగా రోడ్డెక్కి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండగా స్వయంగా వెళ్లిన కలెక్టర్ గత సోమవారం కోర్డినేషన్ సమావేశం ఏర్పాటు చేసి ఆక్రమణలను తొలగిస్తామని చెప్పి తప్పించుకున్నారన్నారు. పాడేరు ఏజెన్సీ 11 మండలాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఐటీడీఏ కార్యాలయంలో ఎనిమిది నెలలుగా పూర్తి స్థాయి పీవో, టీడబ్ల్యూ డీడీ పోస్టులను భర్తీ చేయకపోవడం సరికాదన్నారు. ఆదివాసీ సమాజానికి సేవ చేసి గిరిజనుల మన్ననలు పొందాల్సిన కలెక్టర్ వైఖరి పట్ల గిరిజనులంతా అసంతృప్తిగా ఉన్నారన్నారు. గిరిజనుల అభ్యున్నతికి పాడుపడే ఐఏఎస్ అధికారులను కలెక్టర్, ఐటీడీఏ పీవోలుగా నియమించాలని ఆయన డిమాండ్ చేశారు.
గిరిజన సంఘ నేత
డాక్టర్ తెడబారికి సురేష్‌కుమార్