
పోలవరం పునరావాసంలో తీవ్ర జాప్యం
చింతూరు: పోలవరం ముంపు నిర్వాసితులకు పునారావాసం కల్పించడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని, మునిగే ప్రాంతాలన్నింటినీ ఒకటే కాంటూరుగా పరిగణించి త్వరితగతిన పరిహారం ఇవ్వడంతో పాటు పునరావాసం కల్పించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మండలంలోని ఎర్రంపేటలో శుక్రవారం జరిగిన పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం ముంపు మండలాల ప్రజలు ఏటా వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వారికి అన్నిరకాల సౌకర్యాలతో పునరావాస కాలనీలు నిర్మించి అక్కడికి తరలించాలని ప్రభుత్వాన్ని కోరారు. ముంపునకు గురవుతున్న ఇళ్లకు సంబంధించిన విలువ విషయంలో పోలవరం అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఇష్టానుసారంగా విలువలు వేసి నోటిఫికేషన్ ఇచ్చారని ఆయన ఆరోపించారు. దీంతో నిర్వాసితులు న్యాయపరంగా తమకు రావాల్సిన పరిహారాన్ని నష్టపోయారని ఆయన తెలిపారు. 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ కటాఫ్ తేదీతో సంబంధం లేకుండా పునరావాసం కల్పించే నాటికి పరిహారం, పునరావాసం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏజెన్సీప్రాంతంలో కొండరెడ్ల పరిస్థితి దయనీయంగా ఉందని, వారి గ్రామాలకు రహదారులు, మౌలిక సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వం ట్రైబల్ సబ్‌ప్లాన్ నిధులను వారి అభివృద్ధికి ఎందుకు కేటాయిచడం లేదో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఏటా ఆ నిధులతో గిరిజన ప్రాంతాల్లో సమస్యలను పరిష్కరించాల్సి ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో వీఆర్‌పురం ఎంపీపీ కారం లక్ష్మి, గిరిజనసంఘం రాష్ట్ర కార్యదర్శి లోకనాథం, జిల్లా కార్యదర్శి అశోక్, పార్టీ జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్, శ్రీవాణి, చినబాబు, వెంకట్, శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, బుచ్చమ్మ పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు