
గోదావరికి వరద పోటు
ఎటపాక: గోదావరికి వరద పోటు తప్పదనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి క్రమేపీ పెరుగుతోంది. గురువారం సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్ద నీటిమట్టం 25.8 అడుగులకు చేరుకుంది. ఎగువన ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు వదలటంతో శుక్రవారం సాయంత్రానికి భద్రాచలం వద్ద వరద 37 అడుగులకు చేరుకోవచ్చని సీడబ్ల్యూసీ అధికారులు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా ఏజెన్సీ ప్రాంతంలో వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి కూడా వరద గోదావరి నదికి చేరుతుండటంతో మండలంలోని తోటపల్లి, నందిగామ, మురుమూరు వాగులకు గోదావరి వరద పోటెత్తింది. మహారాష్ట్రలో కూడా భారీగా వర్షాలు పడుతుండటం, ఎగువ ప్రాజెక్టులు నిండుతుండటం, ఇటు శబరి, తాలిపేరుకి వరద ప్రవాహం పెరుగుతున్నాయి. దీంతో మరో రెండు రోజుల్లో గోదావరికి వరద పోటు మరింత ఎక్కువ కానుందన్న సమాచారంతో ముంపు మండలాల ప్రజల్లో భయాందోళన నెలకొంది.
లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
చింతూరు: ఎగువన తెలంగాణ నుంచి వస్తున్న వరద నీటి కారణంగా గోదావరి, శబరి నదులు పెరిగే అవకాశమున్నందున నదీ పరివాహక ప్రాంతాల గ్రామాలకు చెందిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐటీడీఏ పీవో అపూర్వ భరత్ గురువారం ఓ ప్రకటనలో సూచించారు. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసిన నేపథ్యంలో భద్రాచలంలో 37 అడుగుల వరకు వరద నమోదయ్యే అవకాశముందని, ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలని ఆయన సూచించారు.
భద్రాచలం వద్ద 25.8 అడుగులకు
చేరుకున్న నీటిమట్టం

గోదావరికి వరద పోటు