
ఆదివాసీ చట్టాల అమలుపై ప్రభుత్వాల నిర్లక్ష్యం
చింతూరు: ఆదివాసీ చట్టాలు, హక్కుల అమలుపై కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నాయని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోతా రామారావు విమర్శించారు. ఆదివాసీ గిరిజన సంఘం మండల మహాసభ లక్కవరంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీసా చట్టం అనుమతి లేకుండా ఏజన్సీలోని ఖనిజ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం టైగర్‌జోన్ పేరుతో ఏజెన్సీ గ్రామాలను ఖాళీ చేయించాలని చూస్తోందని, దీనిపై ఆదివాసీలంతా ఐక్యంగా ఉద్యమించాలని ఆయన తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో వందశాతం ఉద్యోగాలు ఆదివాసీలతోనే భర్తీ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి మెగా డీఎస్సీ పేరుతో ఆదివాసీలకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. చింతూరు మండల కమిటీ అధ్యక్షుడిగా కారం నాగేష్, కార్యదర్శిగా మొట్టం రాజయ్య, ఉపాధ్యక్షుడిగా వేకా రాజ్‌కుమార్ తదితరులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి పులి సంతోష్, మడకం చిన్నయ్య, గుర్రం రంగమ్మ, పట్టా రాములమ్మ, మడివి శ్రీదేవి, వీరభద్రం పాల్గొన్నారు.
ఆదివాసీ గిరిజన సంఘం
రాష్ట్ర అధ్యక్షుడు లోతా రామారావు