
ఈదురు గాలుల బీభత్సం
కొయ్యూరు: మండలంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. శనివారం సాయంత్రం వీచిన గాలులకు సింగవరం ఐటీడీఏ కాలనీ సమీపంలో నాలుగు విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. కొమ్మిక పంచాయతీ కొత్త బొర్రంపేటలో మర్రి అప్పారావు, బాబూరావు, శంకర్రావుకు చెందిన ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. దీంతో వారికి నిలువ నీడ కరువైంది. ఇంట్లో వస్తువులన్నీ తడిచిపోయాయి. ఆర్థిక స్థోమత లేనందున అధికారులు ఇంటి పైకప్పు రేకులు అందజేసి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
చింతపల్లి: మండల కేంద్రమైన చింతపల్లిలో శనివారం మధ్యాహ్నం నుంచి కురిసిన వర్షానికి రహదారులు, వీధులు జలమయం అయ్యాయి. వాతావరణం చల్లబడటంతో వేసవి తాపం నుంచి స్థానికులు ఉపశమనం పొందారు.
రాజవొమ్మంగి: మండలంలో శనివారం సాయంత్రం దాదాపు రెండు గంటల పాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలులకు అక్కడక్కడ చెట్టకొమ్మలు విరిగి పడ్డాయి. జడ్డంగి పంచాయతీ రేవటిపాలెం సమీపంలో 33/11 కేవీ విద్యుత్ ప్రధాన లైన్‌కు చెందిన రెండు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మరో స్తంభం వంగిపోయింది. దీనితో సరఫరా నిలిపివేసినట్లు ఏఈ అబ్బాయిదొర తెలిపారు. పరిస్థితిని చక్కదిద్దుతున్నామన్నారు. మరోవైపు గాలులకు తాటాకిళ్లు పైకప్పులు దెబ్బతిన్నాయి. పల్లపు ప్రాంతాల్లో, రోడ్లపై నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. వాతావరణం చల్లబడటంతో వేసవి తాపం నుంచి మండల ప్రజలు ఉపశమనం పొందారు.
కూలిన విద్యుత్ స్తంభాలు
కొత్తబొర్రంపేటలో ఎగిరిపోయిన
ఇళ్ల పైకప్పు రేకులు

ఈదురు గాలుల బీభత్సం

ఈదురు గాలుల బీభత్సం