● 425 మంది కాఫీ రైతులకు
రూ.4.99 కోట్ల రుణాలు
● కలెక్టర్ దినేష్‌కుమార్
సాక్షి,పాడేరు: మహిళా రైతులు కాఫీ పండ్లను పల్పింగ్ చేసి పార్చ్‌మెంట్ అమ్మకాల ద్వారా అత్యధిక లబ్ధి పొంది,లాక్‌పతి దీదీలుగా ఎదగాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ కోరారు. మండలంలోని మినుములూరు కేంద్ర కాఫీబోర్డులో కాఫీ మహిళ రైతులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాఫీ గింజల పల్పింగ్,ఆరబెట్టడం, పార్చ్‌మెంట్ గింజల తయారీపై కేంద్ర కాఫీబోర్డు ద్వారా శిక్షణ ఇవ్వాలన్నారు. మట్టి, పేడతో కూడిన నేలపై గింజలను ఆరబెట్టడం వల్ల కాఫీ నాణ్యత,ధరలు తగ్గుతాయన్నారు.డ్రైయింగ్ యార్డులలో ఆరబెట్టిన కాఫీ గింజలు నాణ్యతతో ఉంటాయని, మంచి ధరలు లభిస్తాయని ఆయన తెలిపారు. పల్పింగ్ యూనిట్లను వినియోగించి నాణ్యమైన పార్చుమెంట్ కాఫీ గింజలను ఉత్పత్తి చేయాలని ఆయన సూచించారు. అనంతరం పాడేరు డివిజన్‌లోని కొయ్యూరు మినహా 10 మండలాలకు చెందిన 425 మంది కాఫీ రైతులకు డ్రైయింగ్ యూనిట్లు, పల్పర్ యంత్రాలు, 30 అడుగుల నిచ్చెనలు,టార్పాలిన్ల కొనుగోలుకు యూనియన్ బ్యాంకు మంజూరు చేసి రూ.4,99,37,500 రుణాలను కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ రుణాల్లో కేంద్ర కాఫీ బోర్డు 50శాతం, పీఎంఎఫ్‌ఎంఎఫ్‌సీ 35శాతం సబ్సిడీ అందజేస్తాయని, ఈ రుణాలను మహిళా రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.ఈ కార్యక్రమంలో జేసీ,ఇన్‌చార్జి ఐటీడీఏ పీవో డాక్టర్ అభిషేక్‌గౌడ,కేంద్ర కాఫీబోర్డు డీడీ మురళీకృష్ణ,డైరెక్టర్ కురుసా ఉమామహేశ్వరరావు,డీఆర్‌డీఏ పీడీ మురళీ,పీఎంఎఫ్‌ఎంఎఫ్‌సీ ప్రతినిధి శ్రీనివాస్,యూనియన్ బ్యాంకు ఆర్‌ఎం నరేష్,మినుములూరు ఎస్‌ఎల్‌వో రమేష్,సర్పంచ్ లంకెల చిట్టమ్మ తదితరులు పాల్గొన్నారు,
రెవెన్యూ సర్వీసెస్ డైరీ ఆవిష్కరణ
ఏపీ రెవెన్యూ సర్వీసెస్ వార్షిక డైరీని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ బుధవారం తన చాంబర్‌లో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సర్వీసెస్‌కు సంబంధించిన ఉత్తర్వులు,నిబంధనలను సమగ్రంగా ఈ డైరీలో పొందుపరచడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో డీఆర్‌వో పద్మలత,ఏపీ రెవెన్యూ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వంజంగి త్రినాథరావునాయుడు, కార్యదర్శి బి.శ్రీనివాసరావు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.