కొయ్యూరు: బాలారంలో తలపెట్టిన ఏకలవ్య పాఠశాల భవనాల నిర్మాణం పూర్తి కావస్తున్నాయి. ఈ ఏడాది జూన్ నుంచి చింతపల్లిలో కొనసాగుతోన్న కొయ్యూరు ఏకలవ్య పాఠశాలను బాలారానికి తరలించనున్నారు. ఇక్కడికి పాఠశాల మంజూరై ఐదు సంవత్సరాలు దాటింది. అయితే భవనాలు మాత్రం అలస్యంగా మంజూరయ్యాయి. ఇప్పుడు పూర్తి కానుండడంతో సొంత గూటికి పాఠశాల చేరనుంది. గత మూడు సంవత్సరాల నుంచి కొయ్యూరు ఏకలవ్య పాఠశాల తరగతులను చింతపల్లి యూత్ శిక్షణ కేంద్రంలో నిర్వహిస్తున్నారు. కొయ్యూరులో మొదట రెండు సంవత్సరాల పాటు ఇక్కడ గురుకుల పాఠశాలలో నిర్వహించారు. అనంతరం చింతపల్లికి తరలించారు. ఏడాదిన్నర కిందట పాఠశాల భవనాల నిర్మాణానికి రూ.32 కోట్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం నిర్మాణాలు తుది దశకు చేరాయి.
● 500 మంది విద్యార్థులకు బోధన చేసే భవనం ముందుగా పూర్తయింది. అదే విధంగా 250 మంది బాలురు, 250 మంది బాలికలకు అవసరమైన రెండు హాస్టల్ భవనాలను నిర్మించారు. అవి శ్లాబ్ ప్రక్రియ పూర్తయింది. కొద్ది రోజుల్లో వాటి పనులు కూడా పూర్తి కానున్నాయి. వీటితో పాటు 13 స్టాఫ్ క్వార్టర్లను నిర్మించారు. ప్రిన్సిపాల్, వార్డెన్లకు వేర్వేరుగా క్వార్టర్ల నిర్మాణం చేపట్టారు. పాఠశాలకు అవసరమైన విద్యుత్ సబ్‌స్టేషన్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఇంటర్ వరకు విద్యా బోధన జరగనుంది. వచ్చే విద్యా సంవత్సరానికి అన్ని భవనాలు అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు.
రూ.32 కోట్లతో చురుగ్గా పనులు
ఇప్పటికే పూర్తయిన బోధన భవనం
500 మంది విద్యార్థులకు
రెండు వేర్వేరు భవనాలు
చింతపల్లి నుంచి బాలారం రానున్న
పాఠశాల
ఏకలవ్య పాఠశాల భవనాలు సిద్ధం