చింతూరు: మండలంలోని కొత్తపల్లికి చెందిన సర్పంచ్ సోడె తిరపతమ్మ, అప్పారావుల కుమారుడైన అభిరాం(14) పర్వాతారోహణపై మక్కువ పెంచుకున్నాడు. ఎవరెస్టు అధిరోహించిన వీఆర్‌పురం మండలం కుంజవారిగూడెంకు చెందిన కుంజా దుర్గారావు స్ఫూర్తి, సూచనలతో చింతూరులోని గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న అభిరాం కూడా కిలిమంజారో పర్వతం ఎక్కాలనుకున్నాడు. కుమారుడి ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ఈనెల 14 నుంచి 16 వరకు తెలంగాణలోని భువనగిరిలో ట్రెక్కింగ్‌లో శిక్షణ ఇప్పించారు. కిలిమంజారో అధిరోహణ ఆర్థికభారంతో కూడుకోవడంతో వారు బుధవారం ఐటీడీఏ పీవో అపూర్వభరత్‌ను ఆశ్రయించి తమ కుమారుడి ఆశ నెరవేర్చేందుకు ఐటీడీఏ నుంచి ఆర్థికసాయం చేయాలని కోరారు. దీనిపై స్పందించిన పీవో ముందుగా అభిరాంకు పాస్‌పోర్టు చేయించాలని, ఆర్థికసాయం అందించేందుకు చర్యలు తీసుకుంటానని హామీనిచ్చినట్లు బాలుడి తల్లిదండ్రులు తెలిపారు. భవిష్యత్తులో ఎవరెస్టు శిఖరం అధిరోహించాలనేదే తన లక్ష్యమని అభిరాం తెలిపాడు. పర్వతారోహణపై మక్కువతో శిక్షణ తీసుకుంటున్నానని, ఆర్థికసాయం అందితే కిలిమంజారో పర్వతాన్ని విజయవంతంగా అధిరోహిస్తానని అతను ధీమా వ్యక్తంచేశాడు.
ఓ బాలుడి విజ్ఞిప్తి