వై.రామవరం: మండలంలోని పెదఊలెంపాడు గ్రామంలో పూడ్చి పెట్టిన బాలుడి మృతదేహాన్ని వెలికితీసి మంగళవారం అధికారులు పోస్టుమార్టం నిర్వహించారు. ఎస్‌ఐ బి. రామకృష్ణ వివరాల ప్రకారం.. ఈ నెల 8వ తేదీన పెదఊలెంపాడులో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన కర్ర జాస్వికరెడ్డి (3) అనే బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ నెల 9న బాలుడి మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే గ్రామస్తుల సలహా మేరకు ఈ నెల 17వ తేదీ రాత్రి బాలుడి తల్లి కర్ర నాగదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా బాలుడి మృతదేహాన్ని పూడ్చి పెట్టిన ప్రదేశానికి వెళ్లి డాక్టర్ రాహుల్ ఆధ్వర్యంలో తహసీల్దార్ పి. వేణుగోపాల్, సీఐ బి నరసింహమూర్తి, ఎస్‌ఐ బి. రామకృష్ణ సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో స్థానిక ప్రొహిబిషన్ అదనపు ఎస్‌ఐ పి. చక్రధర్, సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.