పాడేరు: రాష్ట్ర గిరిజన జాతర పాడేరు మోదకొండమ్మ తల్లి ఉత్సవాలకు అన్ని విధాలా సహకరించి విజయవంతమయ్యేలా చొరవ తీసుకోవాలని పాడేరు ఎమ్మెల్యే, మోదకొండమ్మ ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ చైర్మన్ మత్స్యరాస విశ్వేశ్వరరాజు కోరారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ దినేష్‌కుమార్‌ను ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో ఉత్సవ, ఆలయ కమిటీల ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఉత్సవాల నిర్వహణపై చర్చించారు. ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసే సాంస్కృతిక కార్యక్రమాలను ఉదయం 4 గంటల వరకు నిర్వహించేలా పోలీస్, ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఏటా మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.కోటి నిధులు త్వరగా విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్‌కుమార్ మాట్లాడుతూ ఉత్సవాలకు సంబంధించి ఈ నెల 28న అధికారులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామన్నారు. అనంతరం కలెక్టర్‌ను శాలువాతో సన్మానించి వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబునాయుడు, ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శులు కూడా సురేష్‌కుమార్, ప్రశాంత్, ప్రతినిధులు కూడా సుబ్రహ్మణ్యం, ఎస్. రామకృష్ణ, దుర్గారావు, పీడీ చక్రవర్తి, మత్స్య కొండబాబు, గోపాలపాత్రుడు, మహిళా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన పాడేరు ఎమ్మెల్యే
విశ్వేశ్వరరాజు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు