రంపచోడవరం: అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ మూడో మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి కె. దూలయ్య కోరారు. ఈ నెల 21, 22, 23 తేదీల్లో మహారాష్ట్ర నాందేడ్‌లో జరుగుతాయన్నారు. మంగళవారం రంపచోడవరంలో మహాసభల పోస్టర్‌ను విడుదల చేశారు. కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి 2.51 శాతం మాత్రమే కేటాయించారని, రైతాంగ సబ్సిడీలకు కోత విధించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద రూ. 20 వేలు ఇవ్వకుండా రైతాంగాన్ని మోసం చేస్తుందన్నారు. సీలింగ్ భూములను దళితులకు, ఆదివాసీలకు పంపిణీ చేయాలన్నారు. కార్యక్రమంలో పీవోడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనసూయ బాలురెడ్డి, మురళీ పాల్గొన్నారు.