సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని మంగళవారం సింహగిరిపై శ్రీ నృసింహ హోమం ఘనంగా జరిగింది. ఉదయం 7 నుంచి ఆలయ కల్యాణమండపంలో అర్చకులు హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేదికపై చక్రపెరుమాళ్లని కొలువుంచారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, షోడషోపచారపూజలు జరిపారు. పూజలో పాల్గొన్న భక్తులకు కంకణధారణ చేసి హోమగుండం వద్ద వేంజేపచేశారు. మండపారాధన, అగ్నిప్రతిష్ట, హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. కుంభప్రోక్షణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. ఉభయదాతలకు స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదం అందించారు. ఆలయ ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, అర్చకులు కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవస్థానం ఈవో కె.సుబ్బారావు దంపతులు పాల్గొన్నారు.