రాజవొమ్మంగి: మండలంలోని ఉర్లాకులపాడులో మూడు రోజుల్లో మూడు పాడి ఆవులు చనిపోయాయి. మేతకు వెళ్లి వచ్చి ఉన్నట్లుండి కింద పడి చొంగలు కక్కుతూ, కాళ్లాడిస్తూ మరణిస్తున్నాయని కాకూరి రాజుబాబు, తదితర రైతులు మంగళవారం వాపోయారు. గ్రామాల్లో పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేసి తమ పశు సంతతిని కా పాడాలని కోరుతున్నారు. ఈ విషయంపై స్థానిక పశువైద్యాధికారి తరుణ్‌కు వివరణ కోరగా, వేసవిలో పశువులను బయటకు వదిలి పెట్టవద్దని సూచించారు. వాటికి నిత్యం తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. పొలాల్లో లభిస్తున్న పశుగ్రాసంలో రసాయన అవశేషాలు అధికంగా ఉంటున్నాయన్నారు. ఈ గ్రాసం తిన్న పశువులు సొమ్మసిల్లి పోతాయని, సకాలంలో తాగునీరు లభించకపోతే చనిపోతున్నాయని వివరించారు. ఈ అంశంపై గ్రామాల్లో త్వరలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. రైతులు వేసవిలో పశువుల పట్ల శ్రద్ధ చూపాలని కోరారు.