సీలేరు: ఇంటిబయట ఉన్న నీటి తొట్టిలో పడి తీవ్ర అస్వస్థతకు గురైన ఏడాది వయస్సు గల చిన్నారిని సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయస్థితి నుంచి బయటపడింది. దుప్పులవాడ పంచాయతీ వలసపల్లి గ్రామానికి చెందిన పార్వతి,బలరాం దంపతుల కుమార్తె పూర్ణిమ(ఏడాది) మంగళవారం ఉదయం ఇంటి బయట ఆడుతూ నీటి తొట్టిలో ప్రమాదవశాస్తు పడిపోయింది. అరగంట పాటు తొట్టిలోనే ఉండిపోయింది. ఆ తరువాత గమనించిన తల్లిదండ్రులు సీలేరు పీహెచ్‌సీకి తీసుకొచ్చారు. వైద్యాధికారి మస్తాన్ వలీ వెంటనే ప్రధమ చికిత్స చేశారు. విషయం తెలిసిన ఏపీ జెన్‌కో ఏఈ సురేష్ స్పందించి జెన్‌కో అంబులెన్స్‌లో చింతూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం భద్రాచలం తీసుకెళ్లారు. అక్కడ పూర్తిస్థాయిలో చికిత్స అందించి పాప ప్రాణాన్ని కాపాడారు. అంబులెన్స్ డ్రైవర్లు గణేష్, సందీప్ కుమార్ సకాలంలో భద్రాచలం తీసుకెళ్లడం వల్లే మా పాప ప్రాణాలు నిలిచాయని తల్లిదండ్రులు తెలిపారు.
సకాలంలో వైద్యం అందడంతో
నిలిచిన ప్రాణాలు