ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ
పాడేరు: ప్రధానమంత్రి జన్‌మన్ యోజన కింద రూ.1.20 కోట్లతో నిర్మిస్తున్న రెండు మల్టీపర్పస్ కేంద్రాల భవనాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ ఆదేశించారు. మండలంలోని ముంతమామిడి, రణంబడి గ్రామాల్లో నిర్మిస్తున్న మల్టీపర్సప్ కేంద్రాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు కేంద్రాల నిర్మాణాలను రెండు వారాల్లో పూర్తి చేయాలన్నారు. భవన నిర్మాణ పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. ఒక్కో భవన నిర్మాణానికి రూ.60లక్షలు కేటాయించినట్టు చెప్పారు. మల్టీపర్పస్ కేంద్రాల్లో అంగన్‌వాడీ కేంద్రంతో పాటు హెల్త్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆయా గ్రామాల గిరిజనులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు ఆయనను కోరారు. ఇన్‌ఛార్జి పీవో వెంట గిరిజన సంక్షేమ శాఖ డీఈ రవికుమార్, ఏఈ దుర్గాప్రసాద్ తదితరులు ఉన్నారు.