చింతూరు: ఆర్‌అండ్‌ఆర్ కాలనీల ఎంపికకు సంబంధించి నిర్వాసితుల నుంచి అభిప్రాయ సేకరణ జరపాలని పోలవరం నిర్వాసితుల పీడీఎఫ్ కమిటీ నిర్ణయించింది. పోలవరం ప్రాజెక్టు ముంపులో భాగంగా ప్రాధాన్యతా క్రమంలో చేర్చిన చింతూరుకు చెందిన నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ కాలనీల నిర్మాణాలు చేపట్టేందుకు ఇటీవల పోలవరం అధికారులు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులు ఏలూరు జిల్లా తాడ్వాయి, పశ్చిమ గోదావరి జిల్లా యాదవోలు ప్రాంతాలను ఎంపిక చేసినట్టు నిర్వాసితులకు తెలిపారు. కాగా తమకు ఈ రెండు ప్రాంతాలతో పాటు తూర్పు గోదావరి జిల్లా గోకవరం సమీపంలోని కృష్ణునిపాలెంలో కాలనీలు నిర్మించేందుకు తీర్మానం చేయాలని కొంతమంది నిర్వాసితులు కోరడంతో ఆ మేరకు అధికారులు ఆ ప్రాంతాన్ని కూడా తీర్మానం నివేదికలో పొందుపరిచారు. దీంతో ఆ మూడు ప్రాంతాల్లో ఏ ప్రాంతం కావాలనే దానిపై అభిప్రాయ సేకరణ జరిపేందుకు గాను మంగళవారం పీడీఎఫ్ కమిటీ సభ్యులు స్థానిక సాపిడ్ సంస్థ కార్యాలయంలో సమావేశమయ్యారు. అభిప్రాయసేకరణ కోసం కమిటీసభ్యులతో పాటు నిర్వాసితులతో కలిపి క్లస్టర్ల వారీగా టీంలను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం అందిస్తున్న ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ రూ 6.36 లక్షలు కాకుండా గతంలో ప్రభుత్వాల హామీమేరకు రూ.10 లక్షలు కావాలనే నిర్వాసితులకు అవసరమైన తోడ్పాటును పీడీఎఫ్ కమిటీ ద్వారా అందించాలని సమావేశంలో తీర్మానించారు. ఈ కార్యక్రమంలో పీడీఎఫ్ కమిటీ సభ్యులు బొజ్జా పోతురాజు, సయ్యద్ ఆసిఫ్, యాసీన్, అహ్మద్‌అలీ, చిన్నారెడ్డి, సాల్మన్‌రాజు, రంజాన్, శ్రీనివాసరావు, సత్యనారాయణ, నాగేశ్వరరావు, గంగాధర్‌ప్రసాద్ పాల్గొన్నారు.