చింతూరు: ప్రభుత్వం నుంచి పోలవరం నిర్వాసితులకు హక్కుగా రావాల్సిన పరిహారం తప్పకుండా ఇవ్వాల్సిందేనని పోలవరం నిర్వాసితుల పీడీఎఫ్ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. పునరావాసం, పరిహారం విషయంపై చర్చించేందుకు కమిటీ సభ్యులు ఆదివారం స్థానిక సాపిడ్‌సంస్థ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈసందర్భంగా సభ్యులు మాట్లాడుతూ నిర్వాసితుల అభీష్టం మేరకు ఏలూరు జిల్లా తాడ్వాయి, పశ్చిమ గోదావరి జిల్లా యాద వోలు, తూర్పు గోదావరి జిల్లా గోకవరం ప్రాంతాల్లో ఆర్‌అండ్‌ఆర్ కాలనీలు నిర్మించాలని కోరారు. ప్రస్తుతం కుటుంబప్యాకేజీ కింద గిరిజనులకు రూ.6.86 లక్షలు, గిరిజనేతరులకు రూ.6.36 లక్షలు ఇస్తామని అధికారులు చెబుతున్నారని, గతంలో ప్రభుత్వాలు జారీచేసిన జీవోకు అనుగుణంగా రూ.10 లక్షల పరిహారాన్ని అందించాలని వారు కోరారు. 2014ధరల ప్రకారం పరిహారం అందించేందుకు అధి కారులు యత్నిస్తున్నారని, పెరిగిన ఎస్‌ఎస్‌ఆర్ ధరల ప్రకారం పరిహారం మరింత పెంచి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. చింతూరుకు చెందిన పోలవరం నిర్వాసితులు ఏ ప్రాంతాన్ని కోరుకుంటున్నారనే విషయాన్ని తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు త్వరలోనే అభిప్రాయసేకరణ నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు. ప్రభుత్వం నుంచి నిర్వాసితులకు హక్కుగారావాల్సిన పరిహారం అందరికీ దక్కేలా నిర్వాసితులంతా కలసి ఉమ్మడిగా కృషి చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తామని సభ్యులు తెలిపారు. పీడీఎఫ్ కమిటీ సభ్యులు బొజ్జా పోతురాజు, పయ్యాల నాగేశ్వరరావు, ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, షేక్ రంజాన్, సత్యనారాయణ, ఆసిఫ్, శ్రీనివాసాచారి, అహ్మద్‌అలీ, వెంకటేశ్వరరావు, యాసీన్ పాల్గొన్నారు.