కైలాస్‌నగర్: రెండోవిడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను జిల్లా నుంచే ప్రా రంభిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించడంతో జిల్లాలోని గూ డులేని పేదప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న మలివిడత ఇళ్ల ని ర్మాణాలకు శ్రీకారం చుడతా మని, దీనిపై ఈ నెల 21న జరి గే రాష్ట్ర కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని మంత్రి ప్రకటించారు. దీంతో సొంతిళ్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్న పేదలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తొలివిడత కంటే మ లి విడతలో రెట్టింపు స్థాయిలో మంజూరు చేస్తామ నే ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాకు సుమారు 30వేల కు పైగా ఇళ్లు వచ్చే అవకాశముంది. అయితే, వీటిని అనర్హులకు కాకుండా అర్హులను గుర్తించి ఇస్తే పేద ల సొంతింటి కలతోపాటు ప్రభుత్వ లక్ష్యం నెరవేరనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
81వేల మందికి పైగా అర్హులు
దారిద్య్ర రేఖకు దిగవనున్న నిరుపేదల సొంతింటి కల సాకారం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పథకాన్ని అమలు చేస్తోంది. ఒక్కో ని ర్మాణానికి రూ.5లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేస్తోంది. ఇళ్ల కోసం ప్రజాపాలన, ప్రజావాణి కార్యక్రమాలతోపాటు ఎంపీడీవో కార్యాలయాల్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లా వ్యా ప్తంగా అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరి శీలించిన అధికారులు 81,901 మందిని (ఉ ట్నూర్, ఇంద్రవెల్లి మండలాలు మినహా) అర్హులుగా గుర్తించారు. ఇంటి స్థలం ఉండి ఇళ్లు లేనివారిని ఎల్–1 జాబితా లో చేర్చారు. ఇళ్లకు అర్హత ఉండి స్థలం లేనివారు 26,158 మంది ఉన్నట్లు నిర్ధారించారు. వీరిని ఎల్–2 జాబితా లో చేర్చారు. గతంలో ఇందిరమ్మ ఇళ్లు పొంది ఉండటం, ఆర్‌సీసీ పక్కాభవనం ఉండటం, నాలుగు చక్రాల వాహనం, ఆదాయపు పన్ను చెల్లించినవారిని అనర్హులుగా ఎల్–3జాబితాలో చేర్చారు. ఇందులో 53,959 మంది ఉన్నట్లు గుర్తించారు.
అర్హులకు కేటాయిస్తేనే ప్రయోజనం
తొలివిడతలో నియోజకవర్గానికి 3,500 చొప్పున జిల్లాకు 7,800 ఇళ్లు మంజూరయ్యాయి. ఆదిలాబా ద్, బోథ్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి చేసి న విజ్ఞప్తి మేరకు మరో 8వేలకు పైగా ఇళ్లు మంజూ రయ్యాయి. కాగా, ఇందులో చాలామంది అనర్హుల కు మంజూరయ్యాయనే ఆరోపణలు వ్యక్తమయ్యా యి. దీనిపై ప్రజాప్రతినిధులు, అధికారులకు అధికసంఖ్యలో ఫిర్యాదులు కూడా వెళ్లాయి. ఈ విడతలో నైనా అర్హులను గుర్తించి ఇళ్లు మంజూరు చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తద్వారా వారి సొంతింటి కల సాకారమవుతుంది. ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరనుంది. కానీ, ఇందిరమ్మ కమిటీలపైనే ఆధారపడి వారిచ్చే సిఫారసుల మేరకు ఇళ్లు మంజూరు చేస్తే మళ్లీ అనర్హులకే ప్రయోజనం కలిగే అవకాశముంది. అధికారులు ప్రత్యేక పరిశీలన చేపట్టి అర్హులనే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
తొలి విడత.. నత్తనడక..
మంజూరైన ఇళ్లు 16,106
మార్కౌట్‌స్థాయిలో 1,819
బేస్మెంట్ లెవల్‌లో 5,219
రూఫ్‌లెవల్‌లో 2,959
స్లాబ్ లెవల్‌లో 3,026
పూర్తయిన ఇళ్లు 1,477
ప్రారంభంకాని ఇళ్లు 1,606
మొదటి విడతలో మంజూరైన ఇళ్ల వివరాలు
జిల్లాలో తొలివిడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. 16,106 ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు 1,477 మాత్రమే పూర్తి కావడం పరిస్థితికి అద్దం పడుతోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ 1,606 ఇళ్లు ప్రారంభానికే నోచుకోలేదు. 1,819 నిర్మాణాలు పునాది దశలోనే ఉన్నాయి. ఈ విడతలోనైనా నిర్మాణాల్లో వేగం పెంచి త్వరగా పూర్తయ్యేలా చూడాలని ప్రభుత్వం సూచిస్తోంది.


