ప్రైవేట్ విత్తన, ఎరువుల డీలర్ల నుంచి.. ప్రభుత్వ కార్యక్రమ నిర్వహణ కోసమంటూ.. వ్యవసాయ శాఖ తీరుపై విమర్శలు అక్రమాలు జరిగితే చర్యలపై సందేహాలు
సాక్షి,ఆదిలాబాద్: ప్రభుత్వ కార్యక్రమ నిర్వహణ కోసం వ్యవసాయ శాఖ డబ్బులు వసూలు చేయడం వివాదాస్పదమవుతోంది. ప్రైవేట్ విత్తన, ఎరువుల డీలర్ల నుంచి ఇటీవల రశీదులు ఇచ్చి మరీ పెద్ద ఎత్తున వసూళ్లు చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రానున్న వానాకాలం సీజన్‌లో విత్తన లోపాలు, ఎరువుల అక్రమాలు జరిగితే ఆ డీలర్లపై ఎలా చర్యలు తీసుకుంటారు.. విచారణ బాధ్యతా యుతంగా ఎలా చే స్తారు.. అనే చర్చ మొదలైంది. మొత్తంగా ఈ వ్యవహారం ప్రస్తు తం వ్యవసాయ శాఖతో పాటు రైతుల్లోహాట్‌టాపిక్‌గా మారింది.
ప్రభుత్వ కార్యక్రమాలకు..
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 4 నుంచి రైతు వారంగా నిర్వహించారు. రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. దీంతోపాటు కృషి విజ్ఞాన కేంద్రంలో ఇటీవల జోనల్ రీసెర్చ్ ఎక్స్‌టెన్షన్ అడ్వైజరి కమిటీ సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. ఇందులో ఉమ్మడి జిల్లా నుంచి ఆదర్శ రైతులు పాల్గొన్నారు. వ్యవసా య, అనుబంధ శాఖ ల శాస్త్రవేత్తలు పా ల్గొని రైతులకు అవగాహన కల్పించారు. మొత్తంగా ఈ రెండు కార్యక్రమాల నిర్వహణ కోసం వ్యవసాయ శాఖ ప్రైవేట్ విత్తన, ఎరువుల డీ లర్ల నుంచి పెద్ద మొత్తం వసూలు చేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
చర్యలు ఎలా..
రానున్నది వానాకాలం సీజన్. జిల్లాలో సుమారు 6లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయి. పత్తి పెద్ద ఎత్తున సాగవుతుంది. ఆ విత్తనాలను ప్రైవేట్ వ్యాపారులే విక్రయిస్తారు. అంతే కాకుండా ఎరువుల పంపిణీలోనూ డీలర్లదే ప్రధాన భూమిక. అలాంటప్పుడు నకిలీ విత్తనాలు, ఎరువుల అక్రమాలు చోటు చేసుకుంటే వ్యవసాయ శాఖ అధికారులు సదరు కంపెనీలపై నివేదిక వ్యతిరేకంగా ఎలా ఇవ్వగలుగుతారనే ప్రశ్న అందరిలో వ్యక్తమవుతుంది. అలాంటప్పుడు రైతుకు నష్టం జరిగే పరిస్థితులు ఉంటాయి.
జిల్లా కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం
అడ్వైజరి కమిటీ సమావేశం కోసం..
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహణ కోసం ఎవరి నుంచి మేము డబ్బులు స్వీకరించలేదు. కృషి విజ్ఞాన కేంద్రంలో జోనల్ రీసెర్చ్ ఎక్స్‌టెన్షన్ అడ్వైజరి కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి ఉమ్మడి జిల్లా నుంచి రైతులు వచ్చారు. పలువురు శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఏటా ఒక్కో జిల్లాలో ఈ సమావేశం నిర్వహిస్తుంటారు. దానికోసం కొంత మంది డీలర్ల నుంచి మేము రశీదులు ఇచ్చిమరీ డబ్బులు తీసుకున్నాం. ఇది అక్రమ వసూళ్లు కాదు. కార్యక్రమ నిర్వహణ కోసమే ఇలా చేయడం జరిగింది.
– శ్రీధర్‌స్వామి,
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
ప్రైవేట్ కంపెనీల డీలర్లలో ఒక్కొక్కరి నుంచి వేలాది రూపాయల చొప్పున వ్యవసాయ శాఖ యథేచ్ఛగా వసూళ్లకు పాల్పడింది. ఏకంగా వారు డీలర్లకు రశీదులు ఇచ్చి మరీ వసూళ్లు చేపట్టడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. సాధారణంగా ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి గవర్నమెంట్ నుంచే బిల్లులు పెట్టుకునేందుకు ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా బిల్లులు రావడం లేదని ఇలా నేరుగా వసూళ్లు చేశారా.. అనే విషయంపై సర్వత్రా చర్చించుకుంటున్నారు.


