ఆదిలాబాద్‌టౌన్: వైద్యసేవల్లో నర్సుల పాత్ర కీలకమని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా రిమ్స్ ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఉత్తమ సేవలు అందించిన పలువురు స్టాఫ్ నర్సులు, అధికారులను సన్మానించారు. రోగుల విషయంలో నర్సుల చూపే కరుణ, సేవాభావం అమూల్యమైందని అన్నారు. అందుకే వారిని గౌరవప్రదంగా సిస్టర్స్ అని పిలుస్తారని చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇందులో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డిప్యూటీ సూపరింటెండెంట్ నరేందర్, నర్సింగ్ సూపరింటెండెంట్లు కల్పన, రమాదేవి, ఉమ పాల్గొన్నారు.
ఓటమి విజయానికి తొలిమెట్టు
ఓటమి అనేది విజయానికి తొలి మెట్టులా మారుతుందని కలెక్టర్ రాజర్షిషా అన్నా రు. జిల్లా కేంద్రంలోని గెజిటెడ్ నం.1 పాఠశాలలో పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల సందర్భంగా పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం జిల్లాలో మూడు కేంద్రాలను ఏ ర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి వంద శాతం ఉత్తీర్ణులు కావాలని సూచించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ అర్బన్ ఎంఈవో సోమయ్య, డీసీఈబీ సెక్రెటరి గజేందర్, ప్రధానోపాధ్యాయురాలు నీలా దేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


