ఫెయిలైన వారిపై ఫోకస్‌ | - | Sakshi
Sakshi News home page

ఫెయిలైన వారిపై ఫోకస్‌

May 11 2026 7:56 AM | Updated on May 11 2026 7:56 AM

రేపటి నుంచి ‘పది’ ప్రత్యేక తరగతులు జిల్లాలో 350 మంది.. మూడు చోట్ల కేంద్రాలు జూన్‌ 5నుంచి 11వరకు సప్లిమెంటరీ పరీక్షలు

ఆదిలాబాద్‌టౌన్‌: పదో తరగతిలో ఫెయిల్‌ అయిన విద్యార్థులపై కలెక్టర్‌, విద్యా శాఖ ఫోకస్‌ పెంచారు. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీలో వంద శాతం ఉత్తీర్ణులయ్యేలా చర్యలు చేపడుతున్నారు. ప్రత్యేక తరగతుల నిర్వహణకు సిద్ధమయ్యారు. ఈనెల 12 నుంచి ప్రారంభించేందుకు ఆ శాఖ అధికారులు అన్ని ఏ ర్పాట్లు పూర్తి చేశారు. తరగతులకు విధిగా హాజరయ్యేలా చూసే బాధ్యతలను సంబంధిత ప్రధానో పాధ్యాయులకు అప్పగించారు. ఈ విద్యార్థులకు స్నాక్స్‌ తో పాటు దూరప్రాంతాల నుంచి హాజరయ్యేవారికిరవాణా చార్జీలు సైతం చెల్లించనున్నారు.

మూడు కేంద్రాల్లో..

ఈనెల 12 నుంచి జూన్‌ 3 వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం జిల్లాలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని గెజిటెడ్‌ నం.1 పాఠశాలలో జిల్లా కేంద్రంతో పాటు రూరల్‌, మావల, బేల, జైనథ్‌, తలమడుగు, తాంసి మండలాల విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తారు. అలాగే ఇచ్చోడ జెడ్పీఎస్‌ఎస్‌లో ఇచ్చోడ, బోథ్‌, గుడిహత్నూర్‌, బజార్‌హత్నూర్‌, నేరడిగొండ, సిరికొండ విద్యార్థులకు తరగతులు ఉంటాయి. ఇక జెడ్పీఎస్‌ఎస్‌ ఉట్నూర్‌ తెలుగు మీడియం పాఠశాలలో ఉట్నూర్‌, ఇంద్రవెల్లి, నార్నూర్‌, గాదిగూడ విద్యార్థులకు బోధించనున్నారు. ఈ తరగతులు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతాయి. ప్రతి విద్యార్థికి స్నాక్స్‌, రవాణా చార్జీల కోసం సమగ్ర శిక్ష ద్వారా రూ.1100 చెల్లిస్తారు. ఇందులో రూ.100 స్టేషనరీ కోసం వినియోగించాల్సి ఉంటుంది. గతేడాది సప్లిమెంటరీ ఫెయిల్‌ అయిన విద్యార్థుల కోసం కూడా ప్రత్యేక తరగతులు నిర్వహించారు. 251 మంది హాజరు కాగా 225 మంది ఉత్తీర్ణులయ్యారు.

జిల్లాలో..

పది ఫెయిల్‌ అయిన విద్యార్థులు : 350

ప్రభుత్వ యాజమాన్యాలకు సంబంధించి : 312

ప్రైవేట్‌ పాఠశాలలకు సంబంధించి : 38

సబ్జెక్టుల వారీగా..

తెలుగు : 62 హిందీ 19

ఇంగ్లిష్‌ : 173 గణితం 84

సామాన్య : 132 సాంఘిక : 42

Advertisement
 
Advertisement
Advertisement