అ‘ద్వితీయ’ంగా.. | - | Sakshi
Sakshi News home page

అ‘ద్వితీయ’ంగా..

May 10 2026 7:46 AM | Updated on May 10 2026 7:46 AM

బాధను దిగమింగి.. ముందడుగు వేసి

ఆదిలాబాద్‌టౌన్‌: కర్నూల్‌ జిల్లా నంద్యాల తాలుకా మసీద్‌పురానికి చెందిన ఆవుల వెంకటేశ్వర్లు తిర్యాణిలో కానిస్టేబుల్‌ విధులు నిర్వహించేవాడు. 1998లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆయనకు భార్య నీలమ్మతో పాటు ముగ్గురు కుమార్తెలు. ఆ సమయంలో పెద్ద కుమార్తె శారద ఐదో తరగతి, రెండో కుమార్తె స్వప్న 3వ తరగతి, మూడో కుమార్తె సంధ్య ఇంకా బడికి వెళ్లని పరిస్థితి. నీలమ్మ 7వ తరగతి వరకే చదువుకోవడంతో విద్యా శాఖలో ఆఫీస్‌ సబార్డినేట్‌ ఉద్యోగం కల్పించారు. భర్త చనిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పటికీ బాధను దిగమించి పిల్లలను ఉన్నత స్థాయికి చేర్చారు ఆ ఇల్లాలు. ప్రస్తుతం పెద్ద కుమార్తె, రెండో కుమార్తె నర్సింగ్‌ ఆఫీసర్లుగా ఉండగా, మూడో కుమార్తె గృహిణిగా ఉంది. నీలమ్మ ఓపెన్‌ ఇంటర్‌ చదివి రికార్డు అసిస్టెంట్‌గా పదోన్నతి పొందారు. ఇలా రెండు బాధ్యతలు నిర్వర్తిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారిమే.

అటు పాలన.. ఇటు లాలన

కై లాస్‌నగర్‌: ఆదిలాబాద్‌ పట్టణ ప్రథమ పౌరురాలైన బండారి అనూష అటు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా, ఇటు తల్లిగా తన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అమ్మగా పిల్లల బాగోగులు చూడటంతో పాటు చైర్‌పర్సన్‌గా పట్టణాభివృద్ధి కోసం ఆరాటపడుతున్నారు. కూతురు అమిత ఐదో తరగతి చదువుతుండగా, కుమారుడు శివకృష్ణ ఒకటో తరగతిలో ఉన్నారు. ఉదయం పిల్లలిద్దరినీ రెడీ చేసి స్కూల్‌కు పంపించేంత వరకు వారితోనే బీజీగా గడుపుతారు. అనంతరం పట్టణ పాలన వ్యవహారాల్లో లీనమవుతారు. ప్రజాప్రతినిధి అయినప్పటికీ కుటుంబంలో తల్లిగా పిల్లల బాధ్యత కూడా అంతే ముఖ్యమని అంటున్నారు చైర్‌పర్సన్‌.

అమ్మగా ఉంటూనే పాలనలో రాణిస్తున్న వారు కొందరైతే.. కుటుంబ పెద్ద పాత్రనూ పోషిస్తూ ముందుకు సాగుతున్న వారు మరికొందరు. బిడ్డల అభివృద్ధిలో తమదైన పాత్ర పోషిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు పలువురు మాతృమూర్తులు.

బట్టలు కుడుతూ.. కుమారులను ఉన్నత స్థాయికి చేర్చి

ఆదిలాబాద్‌టౌన్‌: పట్టణంలోని సునార్‌ గల్లీకి చెందిన మూడపెల్లి భారతి కుట్టుమిషన్‌పై బట్టలు కుడుతూ ఇద్దరు కుమారులను ఉన్నత స్థాయికి చేర్చింది. భర్త మానసిక వ్యాధితో బాధపడుతుండడంతో అన్నీ తానై ధైర్యంగా ముందుకు సాగింది. పెద్ద కుమారుడు బాలకృష్ణ ప్రస్తుతం ఎస్‌బీఐలో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తుండగా, చిన్న కుమారుడు శివకృష్ణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా ఉన్నారు. వీరు పదో తరగతి తర్వాత పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాలు చేస్తూ తల్లికి చేదోడువాదోడుగా నిలిచారు. ఉద్యోగం వచ్చిన తర్వాత తల్లిని కంటికిరెప్పలా చూసుకుంటున్నారు. నాడు తల్లి పడ్డ కష్టంతోనే తాము ఈ స్థాయికి ఎదిగగలిగామని వారు పేర్కొంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement