‘ఉపాధి’కి అనాసక్తి | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’కి అనాసక్తి

May 10 2026 7:46 AM | Updated on May 10 2026 7:46 AM

● పెరిగిన ఎండ తీవ్రత ● తోడైన ‘ఫేస్‌’ అటెండెన్స్‌ ● గతంతో పోల్చితే తగ్గిన కూలీల సంఖ్య

కై లాస్‌నగర్‌: జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య తక్కువగా నమోదవుతోంది. గతంతో పోల్చితే ఈ ఏడాది భారీగా తగ్గింది. జాబ్‌కార్డులు, పనులు, హాజరవుతున్న కూలీల సంఖ్యకు ఏమాత్రం పొంతన ఉండడం లేదు. ఉపాధి పనులు చేపట్టేందుకు ఏప్రిల్‌, మే నెలలే అనుకూలం. అయితే ఈ సమయంలోనే కూలీలు ఆశించిన స్థాయిలో పనులకు హాజరుకావ డం లేదు. కూలీల సంఖ్య పెంచాలంటూ అధికారులు పదేపదే ఆదేశిస్తున్నా క్షేత్రస్థాయిలో పురోగతి కనిపించని పరిస్థితి. ఇలాగే కొనసాగితే వంద రోజుల పని కల్పించాలనే సర్కారు లక్ష్యం నెరవేరకపోవచ్చని తెలుస్తోంది.

కేంద్ర సంస్కరణల ప్రభావమే..

ఉపాధి పనుల్లో అక్రమాలకు చెక్‌పెట్టాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల పలు సంస్కరణలు అమల్లోకి తెచ్చింది. ఇందులో ప్రధానంగా పనుల కు హాజరయ్యే కూలీలకు ముఖ ఆధారిత (ఫేస్‌ రికగ్నైజేషన్‌ అటెండెన్స్‌) హాజరు అమలు చేస్తోంది. ఇందుకోసం నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టం (ఎన్‌ఎంఎంఎస్‌) యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. కూలీల హాజరును దీని ద్వారానే రెండు పూటలా నమోదు చేయాల్సి ఉంటుంది. ఉదయం పనులకు హాజరైన కూలీ ఫొటోతో అటెండెన్స్‌ నమోదు చేయనుండగా మధ్యాహ్నం గ్రూప్‌ ఫొటోను నమోదు చేస్తున్నారు. దీంతో పనిచేసిన సమయం కంటే అ టెండెన్స్‌ వేసేందుకే ఎక్కువగా పోతుందని కూలీలు చెబుతున్నారు. అలాగే గతంలో మాదిరి సులువైన పనులను చేసే అవకాశం లేదు. చెరువులు, ప్రాజెక్టులతో పాటు నీటి కుంటలు, చెక్‌ డ్యాంల్లో పూడికతీత పనులు, రాళ్ల కట్టలు, మట్టికట్టలు, గుట్టలపైన కందకాలు వంటి కఠినమైన పనులు చేయాల్సి వస్తుంది. గతంలో పనులకు వెళ్లినట్లుగా వెళ్లి కొద్ది సమయానికే తిరిగి వచ్చే వారు. ప్రస్తుతం అలాంటి అవకాశం లేకపోగా, రెండు పూటల అటెండెన్స్‌ నమోదుతో చాలా మంది అంతగా ఆసక్తి చూపనట్లుగా తెలుస్తోంది. ఫలితంగానే కూలీల సంఖ్య తక్కువగా నమోదవుతోంది. అలాగే ఈ ఏడాది ఎండల తీవ్రత కూడా అధికంగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు ఇప్పటికే 46 డిగ్రీల మార్క్‌ దాటాయి. పని ప్రదేశాల్లో సరైన సౌకర్యాలు ఉండకపోవడం, భానుడి ప్రభావంతో చాలా మంది పనులకు హాజరుకావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అక్రమాలకు చెక్‌..

కేంద్రం తెచ్చిన ఎన్‌ఎంఎంఎస్‌ యాప్‌ ద్వారా ఉపాధి పనుల్లో అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్టపడింది. గతంలో మాదిరి బోగస్‌ మస్టర్లు వేసే అవకాశం లే కుండా పోయింది. ప్రస్తుతం నిబంధనల మేరకు ప నులు చేసిన కూలీలకు మాత్రమే అటెండెన్స్‌ నమోదవుతుంది. దీంతో అవసరమైన కూలీలు మా త్ర మే పనులకు హాజరవుతున్నట్లుగా చెబుతున్నారు.

జిల్లాలో ఉపాధి హామీ వివరాలు

మొత్తం జాబ్‌కార్డులు 1,74,628

ఇందులో యాక్టివ్‌ 1,05,514

మొత్తం కూలీలు 1,95,638

పనులకు హాజరవుతున్న వారు 63,600

కూలీల సంఖ్య

పెంచేందుకు చర్యలు

ఉపాధి పనులకు వచ్చే కూలీల సంఖ్య తగ్గిన మాట వాస్తవమే. పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. అటెండెన్స్‌ నమోదు సమస్య దూరం చేసేలా గతంలో ఉన్న మేట్స్‌ వ్యవస్థను తిరిగి అందుబాటులోకి తెస్తున్నాం. నలుగురైదుగురు కూలీలకు మేట్‌ను నియమిస్తున్నాం. దీంతో పాటు వర్షాకాలంలో చేపట్టే వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటేందుకు అవసరమైన గుంతలను తవ్వే పనులను సోమవారం నుంచి ప్రారంభిస్తున్నాం. కూలీల హాజరు పెంచేలా సర్పంచ్‌లతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం.

– కుటుంబరావు, అదనపు డీఆర్డీవో

Advertisement
 
Advertisement
Advertisement